హుజురాబాద్‌లో కొత్త స్వరాలు.. ఈటల ఎఫెక్ట్‌తో రెండు బీజేపీలు

354
eatala rajender

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రపంచలోనే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీలో అక్కడ ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. ‘‘దో నిషాన్ దో విధాన్ దో ప్రధాన్ నహి చలేగీ నహీ చలేగీ’’ అన్న నినాదంతో ముందుకు సాగుతున్న బీజేపీకి ఆ నియోజకవర్గంలో మాత్రం ‘‘దో నిషాన్ దో విధాన్ దో ప్రధాన్ పక్కా చలేగీ పక్కా చలేగీ’’ అన్న పరిస్థితే కనిపిస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది ఎక్కడ సాగుతోంది ఈ పద్ధతి అంటే.. మన హుజురాబాద్ నియోజకవర్గానికి వెళ్లాల్సిందే.

తెలంగాణ రాష్ట్రమంతా కూడా ఉత్సుకతతో చూస్తున్న హుజురాబాద్ బై పోల్స్‌‌ల మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలవబోతున్నారా లేదా అన్నదే ప్రధాన చర్చ. టీఆర్ఎస్ పార్టీని వీడి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ కేడర్‌కు ఈటలకు మధ్య సంబంధాలు సవ్యంగా ఉన్నాయా లేదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆరుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెల్చిన ఈటల బీజేపీలో చేరినప్పటికీ దశాబ్దాల తరబడి కమలంతో మమేకమైన వారితో మాత్రం అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆయన వెంట వచ్చిన వారు మాత్రమే క్రియాశీలక రాజకీయాల్లో కనిపిస్తున్నారు తప్ప ఇంతకాలం కాషాయ జెండా ఎత్తుకుని తిరిగిన వారికి అంతగా ప్రాధాన్యత దక్కడం లేదన్న ఆవేదన వ్యక్తం అవుతోంది.

టాప్ టూ బాటమ్…

క్షేత్ర స్థాయిలో మాత్రమే ఈటల వర్గానికి, బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారికి మధ్య ఈ అగాథం కనిపిస్తోందనుకుంటే పొరపాటే. ఢిల్లీ నుండి గల్లీ వరకు ఉన్న బీజేపీ నాయకుల పరిస్థితి అలానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పి మురళీధర్ రావు ఇదే నియోజకవర్గంలోని కోరపల్లి గ్రామానికి చెందిన వారే. ఆయన ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో కనిపించారు తప్ప హుజురాబాద్‌కు దూరంగానే ఉంటున్నారు. అలాగే కిసాన్ మోర్జా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోల్సాని సుగుణాకర్ రావుది కూడా ఇదే నియోజకవర్గంలోని గండ్రపల్లి గ్రామమే. మరోవైపున మాజీమంత్రి పెద్దిరెడ్డి కూడా దూరంగా ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం బీజేపీ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి కూడా దూరం దూరంగానే ఉండటం గమనార్హం.

ఎన్నికల ఇన్‌చార్జీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గుజ్జుల, సుగుణాకర్ రావులతో చర్చలు జరిపి ఈటలతో సయోధ్యకు ప్రయత్నించి ఒప్పించినప్పటికీ వారు క్రియాశీలకంగా పనిచేయడం లేదు. ఈటల రాజేందర్ పార్టీలో చేరిన సమయంలోనే సుగుణాకర్ రావు జమ్మికుంటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బీజేపీకి చెందిన సీనియర్ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు కూడా. అలాగే హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ఒకరిద్దరు పాత తరం నాయకులు తప్ప మిగతా వారంతా కూడా ఈటలతో కలిసి పనిచేయడం లేదు. కొంతమందితో ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా మాట్లాడి ఒప్పించనప్పటికీ వారు ఈటల చెంతకు చేరుకున్నప్పుడు పట్టించుకోవడం లేదన్న ఆవేదన కూడా స్థానికంగా ఉన్న కేడర్‌లో నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడి బీజేపీ నాయకులకు గాలం వేసి గులాబీ జెండా కప్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షుడు రవి యాదవ్ టీఆర్ఎస్‌లో చేరిపోయారు. బీజేపీకి చెందిన కౌన్సిలర్లు మంజుల, శోభలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈటల చేరికను నిరసిస్తూ జమ్మికుంట మాజీ జడ్పీటీసీ అరుకాల వీరేశలింగం కూడా గులాబీ గూటికి వచ్చారు. తాజాగా మరికొందరు నాయకులను టచ్‌లోకి తీసుకునే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ నాయకులు నిమగ్నం కాగా.. తమకు సముచిత ప్రాధాన్యత దక్కడం లేదన్న ఆవేదనతో అటు వెళ్లాల ఇక్కడే ఉండాలా అన్న ఊగిసాలాటలో ఉన్న వారూ లేకపోలేదు. ఈ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పాతతరం నాయకత్వంలో చాలా మంది ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉంటుండడం గమనార్హం.

ఇక్కడ మాత్రం దో విధాన్..

దేశ వ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఇండియా అన్న నినాదానికి భిన్నంగా హుజురాబాద్‌లో రెండు బీజేపీలు కొనసాగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈటల చేరక ముందు బీజేపీలో ఉన్నా నాయకుల్లో 80 శాతం మంది ఓ దిక్కున ఉంటే ఆ తరువాత వచ్చిన వారంతా ఒక్కటిగా తిరుగుతున్నారు. దీంతో సీనియర్ బీజేపీ, జూనియర్ బీజేపీలు వేర్వేరుగా ఉంటుండంతో పక్కా చలేగీ అన్న రీతిలో వ్యవహరిస్తుండడం గమనార్హం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..