అడుగడుగునా అపాయం.. రైతన్న జర భద్రం..!

by  |
అడుగడుగునా అపాయం.. రైతన్న జర భద్రం..!
X

దిశ, కోదాడ: పంటను కాపాడుకునేందుకు రైతులు ఎంతలా శ్రమిస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలిసే వుంటుంది. రాత్రనక పగలనకా పంటను పసిపాపలా కాపాడుకుంటారు. వరి నాటినప్పటి నుండి ధాన్యం ఇంటికి తీసుకొచ్చే వరకు దాదాపు ఆరు నెలలపాటు అన్నదాతల శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే దేశానికి అన్నంపెట్టే రైతన్నలు నూరేండ్లు బతకాల్సి వున్నా.. చిన్న చిన్న కారణాలతో మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు పడుతున్నాయి.. ఇప్పుడు ఏ పల్లెల్లో చూసినా రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై కనిపిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు.. అరకతోనో, ట్రాక్టర్లతోనో పంట చేనుల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే వర్షాకాలంలో ఎదురయ్యే ప్రమాదాలను, పొంచి ఉన్న ముప్పులను రైతులు పెద్దగా పట్టించుకోరు. పాముల బెడద, విద్యుత్ తీగలు, వాగులు, వంకల్లో వరదల ఉధృత్తి, ఉరుములు, మెరుపులు, పిడుగుల రూపాల్లో అన్నదాతలు మృత్యువుతో చెలగాటమాడుతున్నారు. తెలంగాణలో ప్రతియేడు వర్షాకాలంలో అనేక మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

కొద్ది పాటి జాగ్రత్తలను పాటిస్తే ప్రమాదాల భారీ నుండి తప్పించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వాగులు ప్రవహిస్తుంటాయి నీటి ఉధృతిని అంచనా వేయలేని అన్నదాతలు వాగులు దాటుతూ… ఇంటికి వచ్చే సమయంలో వాగునీటిలో కొట్టుకుపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. పొలం పనులకు వెళ్లి తర్వాత వర్షం కురవగానే తిరుగు ప్రయాణమైన రైతులు ఒక్కోసారి ఇలాంటి బారినపడుతుంటారు. వాగులు దాటే సమయంలో ఒంటరిగా కాకుండా కొద్ది మంది కలిసి వాగుదాటాలి ఇలా చేస్తే నీటి ఉధృతిని తట్టుకునే వీలుంటుంది. ఖరీఫ్ సీజన్‌లో పాముల రూపంలోనూ రైతన్నలను మృత్యువు కబళిస్తోంది. వర్షాలు కురియగానే పాములు బయటికి వస్తుంటాయి. వీటి బారినపడి అనేక మంది అన్నదాతలు, మహిళా రైతులు, కూలీలు ప్రాణాలు కోల్పోతుంటారు. పొలం గట్ల వెంట చెట్లు చేమలు ఏవుగా పెరిగిన చోట పాములు, విషపు పురుగులు చేరుతుంటాయి.

పంటలో కలుపు తీస్తున్నప్పుడు మందుల పిచికారి చేస్తున్నప్పుడు వివిధ పనులకు వెళ్లే రైతులు మహిళలు, కూలీలు వాటి బారినపడుతుంటారు. రైతులు పొలానికి వెళ్లేటప్పుడు చేతిలో కర్ర రాత్రిపూట టార్చిలైటు పాదరక్షలను తీసుకువెళ్లాలి. ఒక వేళ ఊహించని పద్ధతిలో పాముకాటు వేస్తే వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. నాటు వైద్యాన్ని నమ్ముకొని ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. రైతుల పంటల సంరక్షణకు పురుగుల మందులు పిచికారి చేస్తూంటారు మందుల పిచికారి చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు కాళ్లకు రబ్బరు బూట్లు వేసుకోవాలి. ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి, మందులను కర్రతో కలపాలి లేదా చేతులకు గ్లౌజులు వేసుకొని కలపటం చాలా మంచిది.

మందులను పిచికారి చేసిన అనంతరం చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత భోజనం చేయాలి. పిచికారి సమయంలో సిగరేట్లు, బీడీలు, గుట్కాలు, మత్తుపానీయాలను తీసుకోవద్దు. ఎదురుగా గాలివీచే సమయంలో పురుగుల మందులను పిచికారి చేయరాదు. ముఖ్యంగా ఇంటిలో పురుగుల మందులను చిన్నపిల్లలకు అందుబాటులో ఉండకుండా చూడాలి.

విద్యుత్‌తో జాగ్రత్త…

వ్యవసాయానికి ప్రస్తుతం విద్యుత్ వినియోగం తప్పనిసరైనది. పంటపొలాలకు త్రీ ఫేజ్ విద్యుత్ ఎక్కువగా ఉదయంతో పాటు రాత్రి పూట కూడా సరఫరా చేస్తుంటారు. కరెంట్ వచ్చినప్పుడు పంట పొలాలకు నీళ్లు పారించబోయే సమయంలో రైతులు ప్రమాదాలకు గురవుతుంటారు. స్టార్టర్ల బిగింపు, మోటార్ కనెక్షన్‌లు పెట్టే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు రైతులు జంతువుల బారినుండి పంటలను కాపాడుకునేందుకు కొన్ని ప్రాంతాల్లో పంట చుట్టు విద్యుత్ తీగలను అమరుస్తుంటారు. ఇవి కూడా ఒక్కోసారి మనుషుల ప్రాణాల మీదికి తెస్తాయి. ఈ ప్రమాదాల నివారణకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్టార్టర్లు, మోటార్లపై మూతలు బిగించాలి. ఏ కొద్ది తీగలు తెగిన వర్షాకాలంలో త్వరగా కరెంట్ షాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ విద్యుత్ సరఫరాపై అవగాహన లేని రైతులు వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది.

Next Story

Most Viewed