అక్కడ మందు బాబులకు పండుగ.. ఎక్సైజ్ అధికారులపై మహిళలు ఫైర్

by  |
Alcohol shops
X

దిశ కొండపాక : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్ పల్లి మేజర్ గ్రామపంచాయతీలో అధికారులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రం అంతా ఒక లెక్క .. కుకునూర్ పల్లిలో ఒక లెక్క అన్నట్లు ఉంది ఎక్సైజ్ అధికారుల చోద్యం చూస్తుంటే..! ఇలా తెల్లవారిందో లేదో అలా వైన్ షాపులు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు ఉంది అధికారుల వాలకం చూస్తుంటే.. కుకునూర్ పల్లి గ్రామంలో ఉదయం 9 గంటలు కాగానే వైన్స్ షాపులు తెరుచుకుంటున్నాయి. అసలే నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపుల ఏర్పాటు చేశారంటే… ఇంకా సమయం కాక ముందే వైన్ దుకాణాలు ఓపెన్ చేస్తున్నారు.

ఇదంతా జరిగినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో మామూళ్ల వ్యవహారం మామూలుగా లేదేమో అని.. అధికారులు మత్తులో జోగుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన మద్యం షాపుల యజమానులు మరింత రెచ్చిపోతున్నారు. కుకునూరు పల్లి గ్రామంలో నూతన మద్యం పాలసీలో భాగంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు రాజీవ్ రహదారికి అతి సమీపంలో ఉన్నాయి. ప్రభుత్వం సూచించిన కనీస దూరాన్ని కూడా పాటించకుండా రాజీవ్ రహదారికి అతి సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి తమ వ్యాపారాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఇంత జరిగినా ఎక్సైజ్ అధికారులు తమ దృష్టి ఇటువైపు పెట్టకపోవడం గమనార్హం. ఇకనైనా అధికారులు మేల్కొని ఇటు వైపు ఓ కన్నేసి పెట్టాలని మహిళలు, ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed