సింగ‌రేణి ఎన్నిక‌ల‌కు ప‌ట్టు.. పోరాటాల‌కు సిద్ధ‌మైన కార్మికులు

by  |
singareni news
X

దిశ ప్ర‌తినిధి, వరంగ‌ల్ : సింగ‌రేణి కార్మిక సంఘాల ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని యూనియ‌న్లు, పోరాటాల‌కు సిద్ధ‌మ‌య్యాయి. సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాల‌ను ముమ్మ‌రం చేసేందుకు సంయుక్తంగా ముందుకు వెళ్తున్నాయి. ఈనెల 9న హైద‌రాబాద్‌లోని గ‌వ‌ర్న‌ర్ భ‌వ‌న్ ఎదుట‌, లేబ‌ర్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా నిర్వ‌హించేందుకు అన్ని సంఘాలు నిర్ణ‌యించాయి. సింగ‌రేణి అధికారిక కార్మిక సంఘం, టీఆర్ ఎస్ అనుబంధం కార్మిక సంఘం టీబీజీకేఎస్ ప‌ద‌వీకాలం ముగిసి 20 నెల‌లు కావొస్తున్నా ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం లేద‌ని కార్మిక సంఘాలు మండిప‌డుతున్నాయి.

బైలాను అనుస‌రించి ప్ర‌తీ రెండేళ్ల‌కోసారి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల్సి ఉన్నా బాధ్య‌త వ‌హించాల్సిన‌ అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని యూనియ‌న్లు మండిప‌డుతున్నాయి. 2017 అక్టోబర్ 5న సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) గెలుపొందింది. ఈ మేరకు 2019 అక్టోబర్ 5 నాటికి రెండేళ్ల కాలపరిమితి పూర్తయింది. అయితే ఎన్నిక‌లను రెండు మూడు నెల‌ల్లోపు నిర్వ‌హించాల్సి ఉన్నా.. ఇప్ప‌టికీ 20 నెల‌లుగా ఎన్నిక‌ల‌కు అతీగతీ లేకుండాపోయిందని నాయ‌కులు పేర్కొంటున్నారు.

రెండేళ్ల నియ‌మం.. నాలుగేళ్లు ల‌క్ష్యంగానా..?!

బైలా ప్ర‌కారం..సింగ‌రేణి గుర్తింపు సంఘం ఎన్నిక‌లు రెండేళ్ల‌కోసారి జ‌ర‌గాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్ల‌ను కేంద్ర కార్మిక శాఖ ఆదేశాల‌తో రాష్ట్రంలోని కార్మికశాఖ క‌మిష‌న‌ర్‌ చేయాలి. 2017లో నాలుగేళ్ల కాలపరిమితికే ఎన్నికల నిర్వహణకు అన్ని సంఘాలు ఆమోదం తెలిపాయి. అయితే ఎన్నిక‌లు పూర్త‌యిన త‌ర్వాత కేంద్ర కార్మికశాఖ మాత్రం రెండేళ్ల కాలపరిమితితో టీబీజీకేఎస్ యూనియన్కు అధికార పత్రం అందించింది. రెండేళ్ల కాలపరిమితి ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్ మినహా అన్ని యూనియన్లు కేంద్ర కార్మిక శాఖ‌కు తెలిపాయి. ఎన్నికల నిర్వహణ స‌మ‌యంలో నాలుగేళ్ల కాలపరిమితి అంటూ చెప్పారంటూ టీబీజీకేఎస్ నాయ‌కులు వాదన వినిపించారు. అంతే కాకుండా ఎన్నికల్లో గెలిచిన ఆరునెలల తర్వాత 2018 మార్చిలో అధికారికంగా ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అందింద‌ని చెప్ప‌డంతో టీబీజీకేఎస్ వాద‌న‌ల‌కు కేంద్ర కార్మిక శాఖ కూడా సానుకూలంగా స్పందించింది.

2020 ఏప్రిల్ వరకు గుర్తింపు సంఘంగా కొనసాగేలా అవ‌కాశం క‌ల్పించింది. అయితే ఈ గడువు ముగిసి 20 నెల‌లు పూర్త‌యినా సింగరేణిలో ఎన్నికలు నిర్వహించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. క‌రోనాను సాకుగా చూపి నెల‌ల పాటు జాప్యం చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికీ కూడా స్పందించ‌డం లేద‌ని చెబుతున్నారు. నాలుగు ఏళ్ల వ‌ర‌కు కూడా గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ను కొన‌సాగించ‌డ‌మే ల‌క్ష్యంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి పావులు క‌దుపుతున్నార‌ని కార్మిక సంఘాల నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

కేసీఆర్‌కు ఓట‌మి భ‌యం..

కార్మికుల‌కు అనేక హామీలిచ్చిన టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం.. క‌నీసం ఒక్క‌టి కూడా నెర‌వేర్చ‌లేద‌ని, టీఆర్ ఎస్ అనుబంధం కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఎన్నిక‌ల్లో ఓడిపోతుంద‌నే భ‌యంతోనే కేసీఆర్ ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఐఎన్‌టీయూసీ నేతలు మండిప‌డుతున్నారు. గ‌తంలో ఎన్న‌డు లేనంత‌గా సింగ‌రేణి ఎన్నిక‌ల్లో జాప్యం జ‌ర‌గ‌డం వెనుక సీఎం కేసీఆర్ వ‌క్ర‌బుద్ధియే కార‌ణ‌మంటూ టీబీజీకేఎస్‌యేత‌ర సంఘాల నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త సింగ‌రేణి యూనియ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో కార్మిక కుటుంబాల‌కు ఇల్లు, ఇళ్ల స్థ‌లాలు, ఇళ్లు క‌ట్టుకోవ‌డానికి రూ.10ల‌క్ష‌ల లోన్, వార‌స‌త్వ ఉద్యోగాలతో పాటు అనేక హామీలిచ్చిన రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక్క హామీని కూడా ప‌ట్టించుకోలేద‌ని చెబుతున్నారు. కేసీఆర్ మాట‌ల‌ను న‌మ్మ‌కే సింగ‌రేణి ఏరియాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ ఓట‌మి చెందింద‌ని, భూపాల‌ప‌ల్లి, ఇల్లందు, పిన‌పాక‌, భ‌ద్రాచ‌లం, కొత్త‌గూడెం ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను గుర్తు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

హామీలిచ్చి మోసం చేసిండు..

ముఖ్య‌మంత్రి కేసీఆర్ సింగ‌రేణి కార్మికుల‌కు అనేక హామీలిచ్చిడు. వార‌స‌త్వ ఉద్యోగాల క‌ల్ప‌న మొద‌లు సొంత ఇళ్లు అదీ కాకుంటే రెండు వంద‌ల గ‌జాల ఇంటి స్థ‌లం. ఇళ్లు క‌ట్టుకోవ‌డానికి రూ.10ల‌క్ష‌ల లోను అతిత‌క్కువ వ‌డ్డీకి ఇప్పిస్తాన‌ని చెప్పిండు. కానీ ఏదీ చేయ‌లేదు. ఓపెన్ కాస్టుల‌న్నీ కూడా ప్ర‌యివేటు ప‌రం చేస్తున్న‌డు. సింగ‌రేణిలో కార్మిక సంఘాల‌ను నిర్వీర్యం చేసి.. కార్మికుల‌కు సంక్షేమం లేకుండా చేయ‌డ‌మే కేసీఆర్ ల‌క్ష్యంగా పెట్టుకున్న‌డు. టీఆర్ ఎస్ అనుబంధం సంఘం టీబీజీకేఎస్‌ను అక్ర‌మంగా గుర్తింపు సంఘం కొన‌సాగిస్తున్నారు. సింగ‌రేణి ఎన్నిక‌ల ఫ‌లితాలు వ్య‌తిరేకంగా ఉంటాయ‌నే కుటిల నీతితోనే ఎల‌క్ష‌న్లు నిర్వ‌హించ‌డం లేదు. కానీ ఇక ఎన్నిక‌లు నిర్వ‌హించేవ‌ర‌కు పోరాటం చేస్తాం.

ఐఎన్‌టీయూసీ, భూపాల‌ప‌ల్లి డివిజ‌న్ వైస్ ప్రెసిడెంట్‌

Next Story

Most Viewed