ప్రభుత్వానివి గొప్పలు.. రేషన్ డీలర్లవి తిప్పలు

by  |
ప్రభుత్వానివి గొప్పలు.. రేషన్ డీలర్లవి తిప్పలు
X

దిశ, న్యూస్‌ బ్యూరో: లాక్‌డౌన్‌లో పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ పంపిణీలో శ్రమ ఒకరిది.. ఫలితం మరొకరిదన్న చందంగా ఉంది. ప్రజలు ఆకలితో ఉండొద్దని ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా ఇచ్చే రేషన్ కంటే ఈ నెల అదనంగా 6 కిలోల బియం పంపిణీ చేస్తుంది. ఇంత వరకు బాగానే ఉంది కానీ, సరుకులు పంపిణీ చేసే రేషన్ డీలర్లకు వచ్చింది అసలు కష్టం. రేషన్ పంపిణీలో శ్రమ పడుతున్న రేషన్ డీలర్లకు ఎలాంటి కమీషన్ ఇవ్వకపోగా ఆదనంగా హమాలీ ఖర్చులు కూడా వారికే అంటకట్టడంతో రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. ఆదనపు ఖర్చులు మోపడంతో కడు పేద రేషన్ డీలర్ల కుటుంబ జీవన స్థితిగతులు వర్ణనాతీతంగా మారాయి. ఇక, రేషన్ షాపు ఎదుట లబ్ధిదారులు గతంలో ఎన్నడూ లేని విధంగా బారులు తీరుతున్నారు. వారు కరోనా వైరస్ బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా వీరిపైనే ఉండడంతో డీలర్లు నానా అవస్థలు పడుతున్నారు.

‘‘ప్రభుత్వం మమ్మల్ని ఉచితంగా రేషన్ బియం పంపిణీ చేయమని చెబుతుంది. కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడంలో మేము సైతం ప్రభుత్వానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ, ప్రభుత్వం మాత్రం మా ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. తమ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు మా కుటుంబ జీవనం కోసం ఆలోచించడం లేదు. రేషన్ దుకాణం మీద వచ్చే అత్తెసరు కమీషన్‌తో జీవనం సాగిస్తున్నమేము.. కరోనా వైరస్ బారిన పడకుండా స్వీయ నియంత్రణలో భాగంగా సొంత డబ్బులు పెట్టి మా రక్షణతోపాటు దుకాణం వద్దకు వచ్చిన ప్రజల ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. దీనితో తమపై ఆర్థిక భారం పెరుగుతుంది. దుకాణాల వద్దనేమో లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. వారిని కంట్రోలు చేయడానికి నానా తంటలు పడాల్సి వస్తుంది.

ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి మాకు ఎలాంటి సహాయం చేయడం లేదు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఏమీ ఇవ్వలేదు. రేషన్ దుకాణం నడిపిస్తే మాకు వచ్చే ఆదాయం పొట్టకూటికే సరిపోతుంది. గోదాములో లోడు ఎత్తుకున్న నుంచి రేషన్ సరుకులు లబ్ధిదారులకు చేరే వరకు అన్ని ఖర్చులు మేమే భరించాలి. క్వింటాల్ కు రూ.100 ఖర్చు వస్తుంది. వచ్చిన సరుకుల్లో ఏమైనా పాడైనవి వస్తే దానికి బాధ్యత మాదే. ధాన్యం లబ్ధిదారులకు తీసుకునేంత వరకు జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది. ఇంత కష్టపడి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి సేవలు చేసినా మాకు వచ్చేది అత్తెసరు కమీషన్ మాత్రమే.

ఇక ఇప్పడు కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో ప్రభుత్వం ప్రజలకు రేషన్ బియం ఉచిత పంపింణీ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సేవలు మావీ.. పేరు మాత్రం ప్రభుత్వానికి దక్కుతుంది. ఉచితంగా ప్రభుత్వం ప్రజలకు బియం పంపిణీ చేయండం గొప్ప విషయమే. కానీ, మా గోరికట్టేలా ఉంది. ఇప్పటికే అప్పులు చేసి ఈ నెల సరుకుల కోసం డీడీలు చెల్లించాం. ఆ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అదనంగా ఉచితంగా పంపిణీ చేసిన బియ్యానికి కమీషన్ లేక పోగా.. హమాలీ ఖర్చులు, లేబర్ ఖర్చులు దాదాపు రూ.20 వేల వరకు మీద పడుతున్నాయి. ప్రభుత్వం పేదల పొట్ట నింపడానికి ఉయోగపడ్డా.. మా పొట్ట మాడ్చే ప్రయ్నతం చేయవద్దు’’ అని రేషన్ డీలర్లు ప్రభుత్వాని కోరుతున్నారు.

రేషన్ డీలర్లు ప్రజా పంపిణీ సరుకులపై వచ్చే కమీషన్‌తో తమ బతుకు బండిని సాగిస్తుంటారు. రాష్ట్రంలో 17200 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. ఇందులో 80 శాతం మంది కుటుంబ జీవనం కత్తిమీద సాములాంటిదే. రేషన్ సరుకులు లబ్ధిదారులకు చేరవేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే కిలోకు 70పైసల చొప్పున కమీషన్‌తో పూటగడుపుతున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ వీరి బతుకులను మరింత ఊబిలో నెట్టివేసింది. లాక్‌డౌన్‌ నుంచి పేద ప్రజలను గట్టెక్కించడానికి ప్రభుత్వం ఉచితంగా బియం పంపిణీ చేస్తుంది. కానీ, పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డీలర్ల కడుపు మంటలు చల్లార్చడంలో వెనుకడుగు వేయడమే కాకుండా ఆదనపు ఆర్థిక భారాన్ని నెత్తినపెట్టింది. ఈ సమస్య డీలర్లను మరింత ఇబ్బంది పెడుతోన్నది.

ఇప్పటికే అప్పులు చేసి ఏప్రిల్ నెల సరుకుల కోసం 30 శాతం డీడీ చెల్లించినా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అవి రాకపోగా ఉచితంగా పంపిణీ చేసే బియ్యానికి ఎలాంటి కమీషన్ లేదు. గోదాంలో లోడింగ్ నుంచి ప్రజలకు పంపిణీ చేసేంత వరకూ పూర్తిగా ఖర్చులు డీలర్లపై వేయడంతో బతుకు జీవుడా అంటూ జీవనం సాగిస్తున్న డీలర్లు అల్లడిపోతున్నారు. కరోనా వైరస్ మా సావుకు వచ్చినట్లుందని ఆందోళన చెందుతున్నారు.

రేషన్ దుకాణాల వద్ద పోటెత్తుతున్న జనాలు..

ప్రభుత్వం లాక్‌డౌన్ సందర్భంగా ఈ నెల ఇచ్చే 6 కిలో బియ్యానికి ఆదనంగా మరో 6 కిలోలు కలిపి ఉచితంగా ప్రతి వ్యక్తి 12 కిలోల బియం అందజేస్తుండడంతో ప్రజలు రేషన్ దుకాణాలకు బారులు తీరుతున్నారు. ఎన్నడూ రేషన్ తీసుకొని కొంతమంది లబ్ధిదారులు కూడా ఉచిత బియం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. మచ్చుకు పెద్దఅంబర్ పేట్ మండల పరిధిలోని కుంట్లురు గ్రామంలో 2100 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ఇందుకు గానూ ప్రతి నెలలో 450 క్వింటాళ్ల బియం వస్తే సుమారుగా 10 నుంచి 15 క్వింటాళ్ల బియ్యం మిగిలిపోయేవి. 30 నుంచి 40 మంది లబ్ధిదారులు బియ్యం తీసుకునే వారు కాదని డీలర్ తెలుపుతున్నాడు. అయితే ఈసారి బియ్యం తీసుకొని వారి రేషన్ కార్డు రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఒక్కరు కూడా తప్పిపోకుండా బియ్యం తీసుకుపోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉచిత పంపిణీలో భాగంగా అలాట్ మెంట్ అయిన బియ్యం 831క్వింటాళ్లు కాగా, ప్రస్తుతానికి 781.72 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. రేషన్ షాపుకు వచ్చిన గింజ కూడా మిగిలే పరిస్థితి లేదని డీలర్లు తెలుపుతున్నారు. వచ్చేవి వచ్చినట్లు వెంట వెంటనే అయిపోతున్నాయి. ప్రజలు రేషన్ దుకాణాల వద్ద ఉదయం 4 గంటల నుంచి బారులు తీరుతున్నారు.

Tags: Hyderabad, ration goods, beneficiaries, dealers, difficulties, financial burden, problems

Next Story

Most Viewed