తాన్యాస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు నిర్వాకం.. ధరణితో దర్జాగా దగా!

by Rajesh |
తాన్యాస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు నిర్వాకం.. ధరణితో దర్జాగా దగా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కింది. స్లాట్ బుక్కయితే చాలు.. అది ఎక్కడుంది? ఎంత విస్తీర్ణం? గుంటా, రెండు గుంటలా? అది సాగు భూమా? ప్లాటా? అనేది ఏదీ అక్కెర లేకుండానే రిజిస్ట్రేషన్ చేసే వెలుసుబాటు కలిగింది. అక్కడ భారీ వెంచర్ వేశారని తహశీల్దార్లకు తెలిసినా తమకేం.. స్లాట్ బుక్ అయ్యింది.. రిజిస్ట్రేషన్ చేసేశాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో సర్కారు ఆదాయానికి భారీగా గండిపడుతుంది. కొందరు తహశీల్దార్లు వారి స్వలాభం కోసం టౌన్ ప్లానింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. అధికారుల అండదండలు, ధరణి పోర్టల్‌లోని లొసుగులను అడ్డం పెట్టుకొని పైసా పెట్టుబడి లేకుండానే వందల ఎకరాలను మార్కెట్లో పెట్టేస్తున్నారు.

కస్టమర్ల సొమ్ముతోనే రైతుల నుంచి భూములను తీసుకుంటున్నారు. ప్రీలాంచ్ ఆఫర్ల కింద ప్లాట్లే కాదు.. ఫామ్ ప్లాట్లను కూడా అమ్మేస్తున్నారు. ఏడాదిలోగా డీటీసీపీ అనుమతి పొందుతాం. అప్పుడు మీకు ప్లాట్ వస్తుందంటున్నారు. అందులో విల్లా కూడా తామే నిర్మించి ఇస్తామంటూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న కంపెనీలేం కాదు.. రూ.వందల కోట్ల టర్నోవర్ కలిగిన బడా కంపెనీలు కూడా ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట మార్కెటింగ్ చేస్తుండడం విస్మయానికి గురి చేస్తున్నది. ఫార్మ్ ల్యాండ్ దందా ఒక పెద్ద మోసం. ప్రభుత్వం నాలా కన్వర్షన్, జోన్ కన్వర్షన్, లే అవుట్ పర్మిషన్ ఫీ ఇలా చాలా ఆదాయం కోల్పోతున్నది. కొనుగోలుదారులు ఎటువంటి అనుమతులు లేని ఇలాంటి ప్లాట్లు కొని భవిష్యత్తులో అవసరానికి అమ్ముకోలేరు. తాన్యాస్ ఇన్ఫ్రా అనే కంపెనీ రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ప్రీలాంచ్ ఆఫర్ల దందా నడిపిస్తున్నది.

గజాల లెక్కన వసూళ్లు

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో వెస్ట్ ఉడ్ ఫీల్డ్స్ అనే పేరిట తాన్యాస్ ఇన్ఫ్రా అనే బడా కంపెనీ ప్రాజెక్టును చేపట్టింది. సర్వే నం.40, 41, 42 లో ఏకంగా 38.17 ఎకరాల్లో వెంచర్ వేశారు. 1,85,513 చ.గ.ల్లో లే అవుట్ ఉంది. 30 ఫీట్ల రోడ్లు కూడా వేశారు. కానీ డీటీసీపీ, హెచ్ఎండీఏ అనుమతి మాత్రం తీసుకోలేదు. గజాల లెక్కన అమ్మేస్తున్నారు. గుంటల లెక్కన తహశీల్దార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అందులో 2751 గజాల్లో క్లబ్ హౌజ్ నిర్మిస్తామని పేర్కొన్నారు. ఫ్యూచర్ ఎక్స్ టెన్షన్ ఎలా ఉంటుందో కూడా లే అవుట్ లో చూపించారు. అధికారుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు. సర్వే నంబరు 40లో సీలింగ్ పట్టా ల్యాండ్ ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. లేఖ నం.బి/751/2021, తేదీ.23.10.2021 ప్రకారం ఈ భూమిలో ఎలాంటి లావాదేవీలు చేయొద్దంటూ శంకర్ పల్లి సబ్ రిజిస్ట్రార్ ని తహశీల్దార్ టి.సైదులు సూచించారు. ధరణి పోర్టల్ లోనూ సీలింగ్ పట్టా భూములు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ కంపెనీ చేపట్టిన ఫామ్ ల్యాండ్ వెంచర్ లోనూ ఈ సర్వే నంబరును పేర్కొన్నారు. పరిశీలించి ప్లాట్లు కొనుగోలు చేయకపోతే ఫ్యూచర్ లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఎకరం రూ.1.70 కోట్లు!

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మహమ్మదాపూర్ లో ఇదే తాన్యాస్ ఇన్ఫ్రా అనే కంపెనీ 90 ఎకరాల్లో మెగా డీటీసీపీ రెసిడెన్షియల్ విల్లా ప్లాట్ కమ్యూనిటీ లే అవుట్ పేరిట ప్రీ లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో పెట్టుబడి పెడితే లాభాల పంట పండుతుందంటూ బ్రోచర్లు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. రూ.1.70 కోట్లు పెట్టుబడి పెడితే ఎకరం రిజిస్ట్రేషన్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత కస్టమర్ షేర్ కింద 1800 గజాలు ఇస్తారు. రూ.85 లక్షలు పెట్టుబడి పెడితే అరెకరం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత 900 గజాల ప్లాట్ ఇస్తారు. రూ.45 లక్షలకు 10 గుంటలు, డెవలప్ చేసిన తర్వాత 500 గజాలు, రూ.25 లక్షలు చెల్లిస్తే 5 గుంటల భూమి, డెవలప్ చేసిన తర్వాత 250 గజాల ప్లాట్ ఇస్తారు. అంటే ముందుగానే పెట్టుబడి పెట్టాలన్న మాట! కస్టమర్లు పెట్టుబడి పెడితే ఈ కంపెనీ రైతుల నుంచి భూమిని కొనుగోలు చేస్తుంది. ఏడాది కాలంలో డీటీసీపీ అప్రూవల్స్ పొందుతారు.

ఆ తర్వాత లే అవుట్ వేసి పెట్టుబడి కింద డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తారన్న మాట!! 15 నెలలు కూడా పట్టొచ్చునని ముందే చెప్తేస్తున్నారు. దీంట్లో షరతులు కూడా ఉంటాయి. కస్టమర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయాలి. డీటీసీపీ అనుమతులు వచ్చిన తర్వాత గజం ధర రూ.18 వేలుగా ముందే నిర్ణయించారు. ప్రీలాంచ్ ఆఫర్లు, 100 శాతం ష్యూరిటీ ఇస్తామంటూ ప్రపోజ్డ్ విల్లా ప్లాట్ల ప్రాజెక్టును చేపట్టింది. కంపెనీ ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా భూమి కొనుగోలు చేయడం నుంచి కస్టమర్ల సొమ్మునే వినియోగిస్తున్నది. ఏడాదిలో పెట్టిన పెట్టుబడిలో 80 శాతం రిటర్న్ వస్తుందని హామీ ఇస్తున్నారు. 5, 10, 20, 40 గుంటల్లో పెట్టుబడి పెట్టడం స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఏ స్మార్ట్ ఫ్యూచర్ అనే నినాదాన్ని కస్టమర్లకు వినిపిస్తున్నారు. ఏదైనా వివాదాలు తలెత్తి డీటీసీపీ అనుమతులు దాకా వెళ్లకపోతే పెట్టిన పెట్టుబడులు తిరిగి ఎలా వస్తాయన్నది కస్టమర్లు ఆలోచించాలి. ఐనా అంత పెద్ద కంపెనీ కస్టమర్ల డబ్బులతోనే ల్యాండ్ డెవలప్ చేసే బదులుగా సొంతంగా ఎందుకు చేయకూడదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

దీనికి అడ్డుకట్ట వేయడం ఎలా?

తెలంగాణ ప్రివేన్షన్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ యాక్ట్ 1956 (The telangana Prevention of Fragmentation and consolidation of holidings Act, 1956) సెక్షన్ 4, 5, 6 లో లాభదాయకమైన సాగు విస్తీర్ణం కనీసం ఎంత ఉండాలన్నది నిర్ణయించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూమి కనిష్టంగా ఎంత ఉండాలి అనేది నోటిఫై చేయాలి. అప్పుడే అక్రమ ఫార్మ్ ల్యాండ్ దందాకు తెర పడుతుందని న్యాయవాది గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలా ఫామ్ ల్యాండ్ దందా వల్ల ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతున్నది. నాలా కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. కొనుగోలుదారులు ఎటువంటి అనుమతులు లేని ఇలాంటి ప్లాట్లు కొని భవిష్యత్తులో అవసరానికి అమ్ముకోలేరన్నారు. ధరణి పోర్టల్ లో స్లాట్ బుక్ అవుతున్నందున గుంట, రెండు గుంటలు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నామంటూ తహశీల్దార్లు తప్పించుకుంటున్నారు. కనీసం ఆ ల్యాండ్ ని లే అవుట్ గా తీర్చిదిద్దారన్న వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నించడం లేదు. ఒకవేళ తెలిసినా తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ఈ చట్టాన్ని పరిగణనలోకి తీసుకొని చట్ట విరుద్ధంగా లే అవుట్లు వేసి అగ్రికల్చర్ ల్యాండ్ గా అమ్మే కంపెనీలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.

Next Story

Most Viewed