ఫీజుల కోసం.. విద్యార్థులను గదిలో బంధించిన స్కూల్ యాజమాన్యం

by  |
students locked in a room
X

దిశ, మెదక్: ఆ స్కూల్ కరస్పాండెంట్ ఓ రాజకీయ పార్టీకి ముఖ్య అనుచరుడు. మెదక్ నియోజకవర్గంలో తను చెప్పిందే వేదం. తను చేసిందే శాసనం. 1999లో బతుకుదెరువు కోసం ఆంధ్రా నుంచి వలస వచ్చిన సదరు వ్యక్తి, తన ఉనికి కోసం ఓ స్కూల్‌ను స్థాపించాడు. గత 20 ఏళ్లుగా ఈ స్కూల్‌ను అప్రతిహతంగా కొనసాగిస్తున్నాడు. ఓవైపు స్కూల్, మరోవైపు రాజకీయాలు బాగా వంటబట్టించుకున్నాడు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ సీట్ వేయాలి, ఉన్న సీటును ఎలా లాగాలో బాగా ఆరితేరాడంటారు అతని సన్నిహితులు. ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికలు మొదలు, అన్ని ఎన్నికల్లోనూ ఇతగాడిదే హవా, ఇతని బిల్డప్ చూసి ఏకంగా సొంత పార్టీ నేతలే అసహ్యించుకుంటారన్న పేరు కూడా ఉంది. గ్రూపు తగాదాలు రియల్ ఎస్టేట్ ఇలా సారు చేయని వ్యాపారం లేదు. ఏది చేసినా కాంట్రావర్షీ ఆయన నైజం.. ఇలా అన్ని కళలను తనలో దాచుకున్న ఈ వ్యక్తి బుధవారం కూడా వార్తల్లో నిలిచాడు. కాకపోతే తెరచాటుగా.. మెదక్ జిల్లా కేంద్రంలో సిద్దార్థ్ మోడల్ స్కూల్లో బుధవారం చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

School

ఫీజులు కడితేనే గానీ విద్యార్థులను పంపించేది లేదంటూ, పాఠశాల యాజమాన్యం ఏకంగా 60 మంది విద్యార్థులను ఓ గదిలో బంధించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకొని యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ససేమిరా వదిలేది లేదంటూ యాజమాన్యం మొండికేయడంతో విద్యార్థి సంఘాల నేతలు ఎంటరయ్యారు. విషయం కాస్తా దూరం వెళ్లడంతో సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించారు. అయినా కూడా సంవత్సరం నుంచి పెండింగులో ఉన్న ఫీజులను కడితేనే విద్యార్థులను పంపిస్తామని మొండికేయడంతో చివరికి పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, ఎంఈఓ నీలకంఠం స్కూల్‌ వద్దకు చేరుకొని యాజమాన్యంతో మాట్లాడి, పరిస్థితి సద్దుమణిగింది. ముందస్తు సమాచారం లేకుండా డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజులు వసూలు చేయొద్దని చెప్పినా వారి మాటలు తుంగలో తొక్కి సిద్దార్థ్ స్కూల్ యాజమాన్యం మొండిగా వ్యవహరించడం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే సిద్దార్థ్ విద్యా సంస్థల యాజమాన్యంపై కేసులు నమోదు చేసి, దాని గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Next Story