కొత్త సచివాలయం వచ్చే ఏడాదికే!

by  |
Vemula Prashant Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం పనులు ఆశించినంత వేగంగా జరగడంలేదు. ఈ ఏడాది నవంబరు చివరికి మొత్తం నిర్మాణాన్ని పూర్తిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలన్నది షాపూర్జీ పల్లోంజీ సంస్థతో రోడ్లు భవనాల శాఖ కుదుర్చుకున్న ఒప్పందం. కానీ కరోనా సెకండ్ వేవ్ సమయంలో కార్మికుల్లో చాలా మందికి వైరస్ సోకడం, స్వస్థలాలకు వెళ్ళిపోవడంతో పనులు దాదాపుగా ఆగిపోయాయి. అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలుమార్లు సమీక్షించారు.

తాజా పనులను పర్యవేక్షిస్తున్న ఆ శాఖ అధికారులు ఇంకా కనీసంగా 220 రోజులు పడుతుందని, వచ్చే సంవత్సరం ఉగాది వరకు నిర్మాణం పూర్తికావచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం మూడు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 11 అంతస్తులకు శ్లాబ్ వేసే కార్యక్రమం మిగిలి ఉందని ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

ప్రతీ ఫ్లోర్‌కు శ్లాబ్ వేసిన తర్వాత కనీసంగా ఇరవై రోజుల క్యూరింగ్ టైమ్ ఉంటుందని, ఆ ప్రకారం 11 అంతస్తులకు కేవలం శ్లాబ్ పనులకే 220 రోజులు పడుతుందని ఆ అధికారి వివరించారు. దాదాపు మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏడు లక్షల చ.అ విస్తీర్ణంలో 14 అంతస్తులతో నిర్మిస్తున్న కొత్త సచివాలయం పనులు ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది నవంబరు చివరకు పూర్తికావాలి. కానీ సుమారు 1100 మంది కార్మికుల్లో 800 మంది కరోనా వైరస్ బారిన పడడం, మరికొద్దిమంది ఇండ్లకు (ఇతర రాష్ట్రాలకు) వెళ్ళిపోవడంతో మూడు నెలల పాటు పనులన్నీ దాదాపుగా ఆగిపోయాయని, ఇప్పుడే మళ్లీ పుంజుకున్నాయని ఆయన వివరించారు. నిర్మాణ పనుల్లో రెగ్యులర్ వర్కర్లను వినియోగించుకోలేమని, స్కిల్డ్ వర్కర్లను మాత్రమే వాడుకోవాల్సి ఉన్నందున పనులు అనుకున్న షెడ్యూలు ప్రకారం జరగలేదని పేర్కొన్నారు.

షాపూర్జీ పల్లోంజీ సంస్థ మొత్తం శ్లాబ్ వర్క్, గోడల నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రభుత్వానికి (రోడ్లు భవనాల శాఖకు) అప్పగించిన తర్వాత ఇంటీరియర్ డెకొరేషన్‌తో పాటు విద్యుత్, ప్లంబింగ్, కార్పెంటరీ తదితర పనులు పూర్తిచేయడానికి అదనపు సమయం పడుతుందని పేర్కొన్నారు. గతేడాది నవంబరులో షాపూర్జీ సంస్థకు టెండరును ఖరారు చేసిన లెక్క ప్రకారం రూ. 616 కోట్లను నూతన సచివాలయం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ పనులు జరుగుతున్న సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ రావడంతో దాదాపు అన్ని పనులూ ఆగిపోయాయని పేర్కొన్నారు. ఇప్పుడు మొదటి అంతస్తు నుంచి శ్లాబ్ వర్క్ జరుగుతున్నందున ఒక్కో అంతస్తుకు 20 రోజుల చొప్పున మొత్తం 11 అంతస్తులకు శ్లాబ్ వేసే ప్రక్రియ ఏడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు.


Next Story