మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్లాన్ వర్కౌట్.. ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

by  |
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్లాన్ వర్కౌట్..  ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అధికారపార్టీ అభ్యర్థులుగా రంగంలో ఉన్న కూచుకుల్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఎంపిక లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. ఎమ్మెల్సీగా మొత్తం 10 మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ఆరుగురి నామినేషన్లు పలు రకాల కారణాలతో అధికారులు తిరస్కరించారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, ఇద్దరు అధికార పార్టీ అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉండడంతో పోటీ అనివార్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి స్వతంత్ర అభ్యర్థులతో వారి నామినేషన్‌లను ఉపసంహరింప‌చేశారు. ఒక అభ్యర్థి గురువారం సాయంత్రమే తన నామినేషన్ ఉపసంహరించుకోగా, మరో అభ్యర్థి శ్రీశైలం గురువారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకొని తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు అధికారులకు తన ఉపసంహరణ పత్రాన్ని అందజేశారు. దీనితో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు, మరోసారి అధికార పార్టీ అభ్యర్థులు నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసిన వెంటనే ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని అధికార పార్టీ నేతలు భావించారు. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోటీలో ఉండకపోవడం, ఒకేసారి ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కావడం‌తో ఏకగ్రీవం చేసేందుకు మార్గం మరింత సుగమం అయ్యింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు వ్యూహాలను అమలు చేస్తూ, ఉపసంహరణకు మరో రోజు గడువు ఉన్నప్పటికీ వేగంగా పావులు కదిపి సక్సెస్ అయ్యారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అధికారులు ఫలితాలను ప్రకటించవలసి ఉంది.



Next Story

Most Viewed