ఎన్జీటీ స్టే విధించినా పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగలే..

by  |
Potireddipadu project
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం… కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్… కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్​కు లేఖ రాశారు. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ కేఆర్​ఎంబీకి ఫిర్యాదు చేశారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవని, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే విధించినా లెక్కచేయకుండా ఏపీ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తోందని ఆరోపించింది. డీపీఆర్ ఇవ్వడం లేదని, అంతేకాకుండా డీపీఆర్​కోసమే ఈ ప్రాథమిక పనులు అంటూ ప్రాజెక్టు పనులు చేపడుతోందని లేఖలో వివరించింది.

ఏపీ విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టు పనులకు సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి తప్పనిసరి అని కేంద్రం కూడా ఆదేశించిందని, కానీ ఏపీ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదని ఎత్తిచూపింది. ప్రస్తుతం ఏపీ చేస్తున్న ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని స్పష్టం చేసింది. తద్వారా తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాలను పరిరక్షించాలని లేఖలో పేర్కొంది. అంతేకాకుండా తన ఆరోపణల మేరకు తెలంగాణ ప్రభుత్వం తగిన ఆధారాలను కూడా సమర్పించింది.

ఏపీ సర్కార్ అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే ఆపేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ ప్రాంతంలో చేస్తున్న పనుల ఫొటోలను లేఖలో సూచించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్టే విధించినప్పటికీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయంటూ దానికి సంబంధించిన ఆదేశాలను ప్రస్తావించారు. అంతేకాకుండా ఎన్జీటీ ఆదేశాలను కృష్ణా బోర్డు అడ్డుకోలేకపోయిందంటూ ఆక్షేపించారు.

కేవలం డీపీఆర్​ కోసం ప్రాథమిక పనులు అని చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అక్కడ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తోందని, ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు కనీసం నిజనిర్ధారణ కమిటీని కూడా అక్కడకు పంపలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డు అనుమతులు, ఆమోదం లేకుండా పనులు చేపట్టరాదని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు.

ఇటీవల జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఏపీ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారన్న రజత్‌కుమార్‌.. ఏపీ చర్యలతో తెలంగాణలోని కృష్ణాబేసిన్‌లో ఉన్న కరవు, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని మరోసారి వివరించారు. దీనికి సంబంధించి గతంలో కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘం, ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖల వివరాలన్నీ తాజా లేఖలో ప్రస్తావించారు.

ప్రస్తుతం అనుమతుల్లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే ఆపేలా తగు చర్యలు తీసుకోవాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన చిత్రాలను కూడా లేఖతో జతపరిచారు. కాగా కృష్ణా బోర్డుతో పాటు లేఖను కేంద్ర జల సంఘం విభాగానికి పంపించినట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed