జగన్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం.. సాకులు చెప్తే ఊరుకొనేది లేదు

by  |
జగన్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం.. సాకులు చెప్తే ఊరుకొనేది లేదు
X

దిశ, ఏపీ బ్యూరో: ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లింపుల విషయంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లుల చెల్లింపుల్లో అలసత్వం వహిస్తే తాము చాలా సీరియస్‌గా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించింది. ఉపాధి హామీ పథకం బిల్లులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. రూ.1794 కోట్లకు గాను రూ.413 కోట్లు చెల్లింపులు జరిగాయని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కేవలం రూ.43 కోట్లు మాత్రమే చెల్లించారని రూ.413 కోట్లు చెల్లించలేదని డిఫెన్స్ న్యాయవాది కోర్టుకు ఆధారాలతో సహా తెలియజేశారు. దీంతో అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పూర్తి సమాచారంతో ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది. ప్రతీసారి సాకులు చెప్పొద్దని మందలించింది. మీరు చెప్పే సాకులు కౌంటర్‌లో కూడా లేవని ధర్మాసనం పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే సీరియస్‌గా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మరోవైపు ప్రతి బిల్లులో 20శాతం ఎందుకు కోత విధిస్తున్నారని ప్రశ్నించింది. మినహాయించిన ఆ డబ్బులు ఎక్కడ ఉంచుతున్నారని నిలదీసింది. దీంతో ప్రభుత్వం తరపు న్యాయవాది గడువు కోరారు. దీంతో మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి వివరాలు లేకుండా హైకోర్టుకు ఎందుకు వస్తున్నారని నిలదీసింది. అధికారులంతా మళ్లీ వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి డేటాతో ప్రమాణ పత్రం సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి కోర్టు వాయిదా వేసింది. ఇకపోతే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story