నేతన్నను ప్రభుత్వమే ఆదుకోవాలి

by  |
handloom workers
X

దిశ, తెలంగాణ బ్యూరో : చేనేతపై ఆధారపడిన నేతన్నను ఆదుకొని, లాక్ డౌన్ తో నష్టపోయిన చేనేతకు వెయ్యి కోట్లు కేటాయించి కార్మికులకు పని కల్పించాలని చేనేత వర్గాల చైతన్యవేదిక జాతీయ అధ్యక్షుడు చిక్కా దేవదాసు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం నగరంలోని పార్సిహిల్ లోని చేనేత వర్గాల చైతన్య వేదిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చేనేత రంగం ప్రస్తుతం కొన ఊపిరితో ఉందని, ఆ రంగానికి చేయూత నిచ్చేందుకు కృషి చేయకుండా వివక్ష చూపుతోందని ఆరోపించారు.

బడ్జెట్ లో రూ.338 కోట్లు కేటాయించినప్పటికీ వాటిని ఖర్చు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది కొవిడ్ తో చేనేత కార్మికులకు ఉపాధి కరువై మానసిక క్షోభను అనుభవించారని వాపోయారు. సెకండ్ వేవ్ లో వేల సంఖ్యలో నేతన్నలు కరోనా బారిన పడి హోం క్వారంటైన్ లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలిచావులు, ఆత్మహత్యలు నేటికీ కొనసాగుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.

నిల్వఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లాక్ డౌన్ నేపథ్యంలో నెలకు రూ.10వేలు ఆర్థికసాయం ఇవ్వాలని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే చేనేత బంధు పథకం కింద ప్రతి మగ్గానికి రూ.3వేల చొప్పున ప్రతి వాటాకు రూ.36 వేలు పెట్టుబడి సాయంగా ప్రతి చేనేత కార్మికుడి అకౌంట్లో జమచేయాలని కోరారు. చేనేతకు చేయూత నిస్తున్న త్రిప్టు పథకాన్ని వర్తింప చేయాలని, చేనేతకు ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed