బయటపడ్డ మరో కొత్త జీవి.. షాక్‌లో సైంటిస్ట్స్

by  |
millipede
X

దిశ, ఫీచర్స్ : ఒక్కో జీవి ఒక్కో రకమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. చాలా జంతువులకు నాలుగు కాళ్లుంటే ఆక్టోపస్‌కు ఎనిమిది.. స్పైడర్స్‌, స్కార్పియన్స్‌కు తొమ్మిది, సీ-కాక్రోచ్‌కు అయితే 14 వరకు కాళ్లు ఉంటాయి. ఇక సెంటిపెడ్స్ 200 పాదాలతో జన్మిస్తే, ఏకంగా 600-750 కాళ్లతో జన్మించే మిల్లిపెడ్స్ భూమ్మీద అత్యధిక కాళ్లున్న జీవిగా గుర్తింపు పొందాయి. అయితే ఇదే తుది నిర్ణయమని చెప్పలేం.. ఎందుకంటే ఇంకా మానవాళికి తెలియని ఎన్నో జీవులున్నాయి. వాటిని అన్వేషిస్తున్న క్రమంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు వెయ్యికి పైగా కాళ్లున్న ఓ జీవిని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ఫీల్డ్స్ ఎస్పెరెన్స్ ప్రాంతంలో భూగర్భ పర్యావరణ ప్రభావ అంచనా కోసం పరిశోధకుల బృందం గనుల్లో తవ్వకాలు జరిపింది. ఇందులో 1,306 కాళ్ళ మిల్లిపెడ్‌ను గుర్తించింది. ఈ జాతుల్లోని జీవికి 750 వరకు కాళ్లుంటాయని గతంలో భావించినా.. ప్రస్తుతం అంతకు రెట్టింపు కాళ్లున్న జీవి బయటపడటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. 60 మీటర్ల లోతులో లభ్యమైన ఈ జీవులు మీటరు పొడవున్నాయి. వీటికి కళ్లు లేనప్పటికీ స్పర్శ, వాసన సాయంతో పరిసరాలను పసిగడుతుండటం విశేషం. కాగా గ్రీకు దేవత పెర్సెఫోన్‌ను గుర్తుకుతెచ్చేలా ఈ కొత్త జాతికి ‘యుమిల్లిప్స్ పెర్సెఫోన్’ అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.

‘పోర్చుగీస్ మిల్లిపెడ్స్.. ఆస్ట్రేలియాలో ఒక సాధారణ ఆక్రమణ జాతి. సాధారణంగా ఇవి భారీ వర్షం తర్వాత ఎక్కువగా కనిపిస్తాయి. సుమారు 25 విభాగాలున్న ఈ జీవులకు సంబంధించి భూగర్భంలో కొత్త జాతులను కనుగొనడం ఆశ్చర్యంగా ఉంది. కొన్ని మిల్లీ పెడ్స్ గుహల్లో నివసిస్తుండగా, చాలా వరకు ఉపరితల నివాసులే. ఆకులతో పాటు చెత్త వంటి సేంద్రియ పదార్థాలే వీటి ఆహారం. ఒక్క ఆస్ట్రేలియాలో 2,000 కంటే ఎక్కువ మిల్లిపెడ్ జాతులున్నాయి. కాగా ఈ జాతుల మొత్తం సంఖ్య 4,000 వరకు ఉండవచ్చు. సెంటిపెడ్స్ కంటే భిన్నంగా ఉండే మిల్లీపెడ్స్.. చాలా శరీర భాగాలపై రెండు జతల కాళ్లను కలిగి ఉంటాయి. అంతేకాదు మేల్స్ కంటే ఫిమేల్స్‌కే ఎక్కువ కాళ్లు ఉంటాయ’ని ఆస్ట్రేలియన్ మిల్లిపెడ్స్ అధ్యయనకారిణి రోడ్రిగ్ తెలిపారు.



Next Story

Most Viewed