మీ కాళ్లు పట్టుకుంటాం.. దయచేసి మాకు న్యాయం చేయండి (వీడియో)

by  |
elder couple protest
X

దిశ, మణుగూరు: రెవెన్యూ శాఖలో జరిగే అక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెవెన్యూ శాఖలో జరుగుతోన్న అవినీతి మరే ప్రభుత్వ శాఖలో జరుగదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా.. మరోసారి ఆ అధికారులు బుద్ధి చూపించారు. వృద్ధులను లక్ష్యంగా చేసుకొని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన కంపెల బాబు, చంద్రమ్మ(వృద్దదంపతులు) మా భూమిని కబ్జా చేశారంటూ గురువారం స్థానిక తహసీల్దార్ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు. గ్రామంలోని సర్వే నెంబర్ 70లో ఎన్నో ఏళ్ల నుంచి భూమిని సాగు చేసుకుంటున్నామని వారు చెబుతున్నారు. తమకు సంబంధించిన భూమిని ఇదే కమలాపురం గ్రామానికి చెందిన బట్ట శ్రీను అనే వ్యక్తి ఎకరం మూడు గుంటలు, మునిగెల వెంకటేశ్వరమ్మ ఎకరం భూమిని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత నాలుగేండ్లుగా ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగినా ఏ అధికారీ తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. తాత ముత్తాతల కాలం నుంచి తాము ఈ భూమిని సాగుచేసుకుంటున్నామని, కళ్లముందే కబ్జాకు గురవుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎమ్మార్వో ఆఫీసుకు వస్తే, ఇక్కడ కూడా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గురువారం ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ధర్నా చేపట్టామని, మా భూమిని, మాకు ఇప్పించే వరకూ ఇక్కడినుంచి కదలబోమని కూర్చున్నారు. ‘‘అయ్యా.. మీ దండం పెడతాం, మీ కాళ్ళు పట్టుకుంటాం, మా భూమి మాకు ఇప్పించండి. మాకు న్యాయం చేయండి’’ అంటూ రెవెన్యూ అధికారులను వేడుకుంటున్నారు.

‘‘తమ భూమిని కబ్జా చేశారు సారు అని వృద్ధులు తహసీల్దార్, రెవెన్యూ అధికారి(ఆర్ఐ)ని కలిస్తే.. అవునా, నిజమా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. దానికి మేము ఏమీ చేయలేము. వెళ్లి పోలీసు కేసు పెట్టుకోండి.’’ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నానా తంటాలు పడి పోలీస్ కేసు పెట్టి, కోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకొచ్చినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కబ్జా చేసిన వారికి, రెవెన్యూ అధికారులకు సంబంధం ఉందని, అధికారులకు లంచం ఇస్తే ఎవరి భూమినైన పట్టా మార్పిడి, పేరు మార్పిడి చేస్తారని వృద్ధులు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్ఐ వల్లే తమ భూమి కబ్జాకు గురైందని తెలిపారు. కాగా, మణుగూరు మండలంలో భూ కబ్జాలు, దందాలు, దాదాగిరీలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానిక మేధావులు చర్చించుకోవడం గమనార్హం. ఈ అక్రమాలకు పాల్పడేది కూడా సాక్షాత్తు అధికార పార్టీ నేతలే అని, వారికి అధికారుల మద్దతు ఉందని మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed