తగ్గేదేలే.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి క్లారిటీ

by  |
vishaka steel plant protests
X

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదే లేదని కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సోమవారం లోక్‌సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కృష్ణారావు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రజలు, ఉక్కు కార్మిక సంఘాలు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు దీక్షలు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం అయితే అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం సైతం చేసింది. అంతేకాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదంటూ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కంపెనీ లాభాలబాట పట్టేందుకు పలు సూచనలు చేస్తూ కూడా సవివరంగా లేఖ సైతం రాశారు. అయినప్పటికీ కేంద్రం వెనకడుగు వేయడం లేదు.

దీంతో ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రారంభమైన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఇప్పటికే ఉక్కు పరిరక్షణ సమితి వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేసింది. కొత్త పరిశ్రమల్ని ఇవ్వకుండా ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్‌పరం చేయడం దారుణమని ఉక్కు పరిరక్షణ సమితి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా కార్మిక సంఘాల నేతలు కేంద్రమంత్రులు, పలు పార్టీల నేతలతో భేటీ అవుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇకపోతే ఆగస్టు 2,3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా పోరాటం చేస్తున్నారు.


Next Story

Most Viewed