సామాన్యులపై ’స్మార్ట్‘ భారం.. దేశమంతటా అమలు

by  |
సామాన్యులపై ’స్మార్ట్‘ భారం.. దేశమంతటా అమలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సామాన్యులపై స్మార్ట్ మీటర్ల భారం పడనున్నది. సింగిల్ ఫేజ్ మీటర్ల ధర రూ. 3 వేలు, త్రీఫేజ్ ధర దాదాపు 8 వేలు ఉన్నది. మూడేళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కేంద్రం సమాయత్తమైంది. ఈ మీటర్లను తప్పనిసరిగా బిగించుకోవాలన్న నిబంధన రానున్నందున ఈ భారాన్ని కూడా గృహ యజమానులే మోయాల్సి ఉంటుంది. అద్దెకు ఉన్నవారికీ యజమానుల నుంచి ఒకరమైన ఒత్తిడి పడే అవకాశం లేకపోలేదు. దేశమంతా స్మార్ట్ మీటర్లను బిగించే ప్రక్రియను మూడేళ్లలో పూర్తి చేయాలని కేంద్ర ఇంధన శాఖ భావిస్తున్నది. వీటి ఖర్చును మాత్రం గృహ యజమానులే భరించాలి. ప్రతీ మీటర్ కొనుగోలుకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 15% మేర భరించనుంది. మిగిలినదంతా యజమానే భరించాల్సి ఉంటుంది. మీటరు ధరను తొలుత కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోంచి ఖర్చుచేసినా ఆ తర్వాత యజమానులే ప్రతీ నెలా వాయిదాల చొప్పున సర్వీసుచార్జి రూపంలో కట్టాల్సి ఉంటుంది.

వృథా అరికట్టేందుకే

విద్యుత్ వృథాను అరికట్టడంతో పాటు పారదర్శకమైన వ్యవస్థను నెలకొల్పడానికి ఈ విధానం అనివార్యమన్న భావనతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ మీటర్లను బిగించింది. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ సహకారంతో జరుగుతున్న ఈ ప్రక్రియ సంతృప్తికర ఫలితాలనే ఇచ్చిందని ఇంధనశాఖ అభిప్రాయపడుతోంది. దీంతో రానున్న మూడేళ్ళలో దేశమంతా స్మార్ట్ మీటర్లను బిగించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. అవసరమైతే ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్కడి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ల కోరిక మేరకు మరో రెండేళ్ల గడువు ఇవ్వాలనుకుంటున్నది. కేవలం ఈఈఎస్ఎల్ మీద మాత్రమే ఆధారపడకుండా కొన్ని ప్రైవేటు సంస్థలను కూడా ఇందులో భాగస్వాములను చేసేలా ఇంధన శాఖ ఇటీవలే టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.

సాంకేతిక సమస్యలపై దృష్టి

స్మార్ట్ మీటర్ విధానం ద్వారా విద్యుత్ సరఫరాలో వృథాను అరికట్టడంతోపాటు పారదర్శకతను నెలకొల్పవచ్చని, నెలవారీగా ఏ మేరకు వినియోగించుకున్నారో దాని ప్రకారమే చెల్లింపు జరిగేలా చేయవచ్చని కేంద్ర ఇంధనశాఖ అభిప్రాయం. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల డిస్కంల పనితీరును అధ్యయనం చేయగా సగటున కనీసంగా 15% మేర విద్యుత్ వృథా అవుతున్నదన్న నిర్ధారణకు వచ్చింది. దీన్ని నివారించడానికి స్మార్ట్ మీటర్ల వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తోంది. ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అమలు సంతృప్తికర ఫలితాలను ఇచ్చిందంటూ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఇంధన శాఖ అధికారులు ఇటీవల వివరించారు. స్మార్ట్ మీటర్ల విధానం ద్వారా డిస్కంలు ప్రతీ మీటర్‌లో వినియోగం ఏ సమయంలో ఎలా ఉంటుందో గమనించే వీలు ఉంటుంది. దానికి అనుగుణంగా సరఫరా వ్యవస్థలో తగిన ముందజాగ్రత్త చర్యలు తీసుకోవడం వీలవుతుంది. పైగా పర్యవేక్షణంతా ‘ఆన్‌లైన్’ విధానంలో జరుగుతున్నందున ఎప్పటికప్పుడు వినియోగదారుల మొబైల్ ఫోన్‌కే సమాచారం వెళ్తుందని, పొదుపు చేసుకోడానికి కూడా వీలవుతుందని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్లకు వాడే టెక్నాలజీ లాగానే ఇకపైన విద్యుత్ గ్రిడ్‌లో సైతం సాఫ్ట్‌వేర్‌ను వాడాల్సి ఉంటుందని, వాటిని ‘స్మార్ట్ గ్రిడ్’లుగా తీర్చిదిద్దాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విధానంలో సైబర్ దాడులకు అవకాశం ఉంటుందని, దాన్ని తట్టుకునే వ్యవస్థను రూపొందించుకోవాలని వివరించారు. ఇటీవల సైబర్ దాడుల కారణంగా ముంబయి నగరంలో విద్యుత్ వ్యవస్థ కొన్ని గంటల పాటు కుప్పకూలిన అంశాన్ని ప్రస్తావించారు. అదే విధంగా లక్నో నగరంలో 15 లక్షల మీటర్లపై సైబర్ దాడుల ప్రభావాన్ని కూడా కమిటీకి అధికారులు వివరించారు.


Next Story