నవవధువు మృత దేహాన్ని మోసిన.. ఎమ్మెల్యే, ఎస్ఐ

by  |
mla
X

దిశ,వికారాబాద్: వరదలో కొట్టుకుపోయి చనిపోయిన నవ వధువు మృతదేహన్ని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎస్ శేఖర్ గౌడ్ దాదాపు రెండు కిలోమీటర్లు స్థానికులతో కలిసి భుజం మీద మోసుకుంటూ వచ్చారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమై జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అకాల వర్షం నవ వధువును పొట్టన పెట్టుకోవడమే కాకుండా, ఒక యజమానిని మింగేసి కుటుంబానికి తీవ్ర శోకాన్ని మిగిల్చింది.

ఈ సంఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పరిశీలించారు. సోమవారం వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలం తిమ్మాపూర్ గ్రామం వద్దగల వాగులో కారు కొట్టుకొని పోయిన ప్రాంతానికి 4 కిలోమీటర్లు కాలినడకన వచ్చారు. ఎస్పీ నారాయణతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృత దేహన్ని స్థానికులతో కలిసి ఒడ్డుకు చేర్చారు. అలాగే తప్పిపోయిన వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని పోలీస్ శాఖ, రెవెన్యూశాఖను ఆదేశించారు.

మర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన నవాజ్ రెడ్డి, మోమిన్ పేట్ గ్రామ ప్రవళికకు ఈ నెల 26 న వివాహం జరిగింది. నిన్న సాయంత్రం మోమిన్ పేట్ నుంచి రావులపల్లి తిరిగి వెళ్తుండగా భారీ వర్షంతో రావులపల్లి- తిమ్మాపూర్ మధ్యలో ఉన్న వాగులో కారు కొట్టుకుపోయింది. ఆ కారులో నవాజ్ రెడ్డి, భార్య ప్రవళిక, అక్కలు శ్వేత, రాధిక, అల్లుడు శశాంక్ రెడ్డి, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి ఉన్నారు. కొట్టుకుపోయిన కారులో నుంచి నవాజ్ రెడ్డి, అక్క రాధిక బయట పడ్డారు. అక్క శ్వేత, భార్య ప్రవళిక మరణించారు. అల్లుడు శశాంక్ రెడ్డి, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి, ఆచూకి ఇంకా లభించలేదు, వారి కుటుంబాన్ని పరామర్శించి, మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, పోస్టుమార్టం త్వరగా నిర్వహించాలని ఆసుపత్రి వైద్యులను ఎమ్మెల్యే ఆనంద్ ఆదేశించారు.

kale

అదే విధంగా వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం ఫుల్‌మామిడి గ్రామంలో వాగులో కొట్టుకొనిపోయిన శ్రీనివాస్ మృతదేహాన్ని ఎమ్మెల్యే కాలె యాదయ్య వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించి, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు. ఘటన స్థలంలో ఎస్పీ నారాయణ, డిఎస్పీ సంజీవ్ రావు, సిఐ వెంకటేష్, ఎస్ఐలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పరిశీలించారు.

Next Story

Most Viewed