జలపాతంలో యువకుడి మృతదేహం.. ముంచారా..? మునిగాడా..?

324

దిశ, మర్రిగూడ :మండలంలోని అజిలాపురం గ్రామపంచాయతీ లో ఉన్న బుగ్గ జలపాతంలో గల్లంతైన తాళ్ల సాయితేజ మృతదేహం సోమవారం లభ్యమైంది. మృతుడు సాయి తేజ ఆదివారం స్నేహితులతో విహార యాత్రకు వచ్చి జలపాతంలో గల్లంతైన విషయం  తెలిసిందే. సోమవారం ఉదయం స్థానిక పోలీసులు, బంధువులు తల్లిదండ్రులతో కలిసి జలపాతం వద్ద గాలించడంతో మృతదేహం లభ్యమైంది. ఈమేరకు మృతదేహాన్ని స్వగ్రామమైన సూర్యాపేటకు జిల్లాలోని టేకుమట్లకు తరలించారు. కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మృతదేహంపై గ్రామస్తులకు అనుమానాలు..

బుగ్గ జలపాతంలో పడి మృతి చెందిన సాయి తేజ మృతిపై అజిలాపురం గ్రామస్తులు పలు రకాలైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జలపాతంలో మృతదేహం గల్లంతయ్యే నీటి ప్రవాహం ఉండదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పై నుంచి వచ్చే వరద దిగువకు వెళ్తోంది తప్ప స్టోరేజ్ ఉండదని, మృతి చెందడానికి ఆస్కారం ఉండదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. స్నేహితుల మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా..?  సాయి తేజను ఎవరైనా ముంచారా..?  అనే పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పోలీసులు సమగ్ర విచారణ చేసి సాయి తేజ మృతిపై అనుమానాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..