ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడింది : ఎన్‌జీటీ

by  |
ngt
X

దిశ, ఏపీ బ్యూరో: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వం కోర్టుధిక్కరణకు పాల్పడినట్లు అర్థమవుతోందని అభిప్రాయపడింది. రాయలసీమ ఎత్తిపోతలపై సోమవారం ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఫోటోలను ఎన్జీటీ పరిశీలించింది. ప్రాజెక్టు వద్ద పెద్దఎత్తున పనులు జరిగినట్లు తెలుస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడిందని వ్యాఖ్యానించింది.

ధిక్కరణ కేసులో గతంలో అధికారులను జైలుకు పంపారా? అధికారులను ఎన్జీటీ నేరుగా జైలుకు పంపవచ్చా? లేక హైకోర్టు ద్వారా అధికారులను జైలుకు పంపాలా? అని పిటిషనర్ల అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. అయితే అధికారులను శిక్షించిన సందర్భాలు ఎదురుకాలేదని ఎన్జీటీ తెలిపింది. ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వాదనలు వినించింది. ఆగస్టు 7నాటికే ప్రాజెక్టు పనులు నిలిపివేశామని తెలిపింది. ఈ అంశంపై ఇప్పటి వరకు పర్యావరణ శాఖ నివేదిక ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. పర్యావరణ శాఖతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుమ్మక్కైనట్లు అనిపిస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది.

మరోవైపు ఇటీవలే రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించిన కేఆర్ఎంబీ తమ నివేదికను సమర్పించింది. ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలను ఫోటోలతో సహా నివేదికలో పొందుపరిచింది. అప్రోచ్ చానల్, లింక్ కెనాల్, బ్యాచింగ్ ప్లాంట్, ఫోర్ బే, పంప్ హౌస్, డెలివరీ మెయిన్ లింక్ నిర్మాణ సామాగ్రి వంటి వివరాలను నివేదికలో పొందుపరిచింంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. అయితే నిర్మాణ పనులకు సంబంధించిన సామాగ్రిని మాత్రం నిల్వ చేశారని కేఆర్ఎంబీ ధర్మాసనానికి వివరించింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 27న తదుపరి చర్యలపై తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. అప్పటి వరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.


Next Story