పాతికేళ్ల జీవన సౌధం నేలమట్టం.. ఉమెన్స్ డే రోజే మహిళ కన్నీటి పర్యంతం

by Disha Web Desk 19 |
పాతికేళ్ల జీవన సౌధం నేలమట్టం.. ఉమెన్స్ డే రోజే మహిళ కన్నీటి పర్యంతం
X

దిశ, గుమ్మడిదల: పాతికేళ్లుగా తన జీవనధారమైన లాండ్రీ దుకాణంను పంచాయతీ సిబ్బంది ఉన్న ఫలంగా తొలగించడంతో ఓ మహిళ కన్నీటి పర్యంతం అవుతున్నది. ఉమెన్స్ డే ముందు రోజున ఆ మహిళ దుక్కిస్తున్న తీరును చూసి.. గ్రామస్తులు పంచాయతీ సిబ్బంది వైఖరిపై దుమ్మెత్తి పోశారు. సదరు వితంతు మహిళ ఏర్పాటు చేసుకున్న ఇస్త్రీ డబ్బాలో వల్ల గ్రామ పంచాయతీకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కక్ష పూరితంగా డబ్బా కూల్చారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సంగారెడ్ది జిల్లా గుమ్మడిదలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గుమ్మడిదల మండల కేంద్రంలో శివాలయం ప్రహరీ గోడ పక్కన ఇస్త్రీ డబ్బా పెట్టుకొని దాదాపు పాతికేళ్లుగా చంద్రకళ జీవనం సాగిస్తోంది. ఈమె భర్త గత మూడు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి పూర్తిగా ఇస్త్రీ డబ్బుపై వచ్చే కొద్దిపాటి డబ్బులతో ఆమె జీవనం సాగిస్తోంది. అయితే ఈ మహిళపై కొంతమంది కక్షపూరితంగా గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేశారు. డబ్బాతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కావాలని ఫిర్యాదు చేసినట్లు చంద్రకళ చెబుతుంది. గ్రామసభలో కూడా చంద్రకళ కుటుంబ సభ్యులు తమకు వేరొక స్థలం చూసుకునే అంతవరకు సమయం ఇవ్వాలని జెడ్పీటీసీ కుమార్ గౌడ్‌కు విన్నవించుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందిస్తూ జెడ్పీటీసీ వేరొక స్థలం దొరికేంత వరకు డబ్బాను తొలగించవద్దని అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు. అయినప్పటికీ సోమవారం చంద్రకళ డబ్బాను పంచాయతీ సిబ్బంది అక్కడ నుంచి తొలగించారు. ఇస్త్రీ చేసుకుని బ్రతికే మహిళ అయిన తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తూ.. గూడు, ఆధారం లేకుండా చేశారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. పంచాయతీ తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రకళకు జీవనాధారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.



Next Story

Most Viewed