ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.. అందరి ముందు ఏడ్చేసిన మంత్రి

by Disha Web |
ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.. అందరి ముందు ఏడ్చేసిన మంత్రి
X

దిశ, జవహర్ నగర్: దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణకు దక్కిందని, సీఎం కేసీఆర్ వల్లే అది సాధ్యమైందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం కార్పొరేషన్ పరిధిలో మేయర్ కావ్య, పాలక వర్గం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవంలో భాగంగా మహిళా బంధు కేసీఆర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి పాల్గొని మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ పిలుపు మేరకు మహిళా దినోత్సవంలో భాగంగా మహిళా బంధు విజయవంతం చేసుకుని తీరుతామన్నారు. అంతేకాకుండా జవహర్ నగర్ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం శుభసూచకంగా భావిస్తున్నాంమని అన్నారు.

ఆనంద భాష్పాలతో మంత్రి మల్లారెడ్డి...!

మహిళా దినోత్సవ సందర్భంగా మంత్రి మల్లారెడ్డికి పలువురు మహిళలతో పాటు మేయర్ కావ్య రాఖీలు కట్టారు. పలువురు మహిళలు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను పొగడ్తలతో ముంచెత్తారు. మాజీ వార్డు సభ్యురాలు కేతమ్మ మాట్లాడుతూ తాను గతంలో చాలా పార్టీల్లో పని చేశానని, కానీ టీఆర్‌ఎస్ లాంటి పార్టీని నేను చూడలేదని అన్నారు. అభివృద్ధి తోపాటు మహిళలకు సముచిత గౌరవం కేవలం టీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని ఈ సందర్భంగా అన్నారు. మహిళలకు గౌరవం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్, మల్లారెడ్డిలకు అభినందనలు వెల్లువెత్తాయి. దీంతో సమావేశంలో మంత్రి మల్లారెడ్డి కళ్ళల్లో ఆనందబాష్పాలు వచ్చాయి. సభలో పాల్గొన్న మహిళలు నూతన ఉత్తేజంతో ప్రశంసలు కురిపించారు.

జవహర్ నగర్‌ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం...

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో డంపింగ్ కుంపటి తెచ్చి జవహర్ నగర్‌లో పెట్టారని, దాన్ని వెస్ట్ టూ ఎనర్జీ పవర్ ప్లాంట్ చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి . కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే యాభై ఆరు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. మరో 30 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులకు కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో కార్పొరేషన్‌ను మంచి పట్టణంగా తీర్చిదిద్దుతామి ఆయన అన్నారు. 700 విద్యుత్ స్తంభాలతో కార్పొరేషన్ పరిధిలో విద్యుత్ కాంతులు వెదజల్లే ఏర్పాట్లు చేపడతామన్నారు. జిఓ 58, 59 ప్రకారం ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. 2021 వరకు నివాసం ఉన్న ప్రతి ఇంటికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాకారులు మహిళలు కోలాటాలు, ఆటల పోటీలు నిర్వహిస్తూ మహిళా సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత్రి శాలిని, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Next Story