స్వల్పంగా తగ్గిన యూపీఐ లావాదేవీలు!

by Web Desk |
స్వల్పంగా తగ్గిన యూపీఐ లావాదేవీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీల విలువ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం రూ. 8.27 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇది అంతకుముందు నెలలో నమోదైన దానికంటే స్వల్పంగా తక్కువని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సంఖ్యా పరంగా సమీక్షించిన నెలలో మొత్తం 452 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతకుముందు జనవరిలో యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగిన లావాదేవీలు 461 కోట్లు కాగా, విలువ పరంగా రూ. 8.32 లక్షల కోట్లు. అయితే, ఫాస్టాగ్ టెక్నాలజీ ద్వారా టోల్ ప్లాజాల వద్ద ఆటోమెటిక్ కలెక్షన్లు స్వల్పంగా పెరిగాయి. గత నెలలో మొత్తం 24.36 కోట్ల ఫాస్టాగ్ లావాదేవీలు జరగ్గా, విలువ పరంగా రూ. 3,631.22 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఫిబ్రవరి నెలలో తక్కువ రోజుల కారణంగా విలువతో పాటు సంఖ్యా పరంగా కూడా తక్కువ లావాదేవీలు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే యూపీఐ లావాదేవీలు సంఖ్యా పరంగా 97 శాతం, విలువ పరంగా 94 శాతం పెరిగాయి. అంతకుముందు నెలలో ఫాస్టాగ్ లావాదేవీలు 23.10 కోట్లు, విలువలో రూ. 3,603.71 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే, 24 గంటల తక్షణ చెల్లింపుల సేవలు(ఐఎంపీఎస్) ద్వారా నగదు బదిలీ జనవరిలో రూ. 3.87 లక్షల కోట్ల నుంచి గత నెల రూ. 3.84 లక్షల కోట్లకు పడిపోయింది. సంఖ్యా పరంగా ఐఎంపీఎస్ లావాదేవీలు జనవరిలో 44 కోట్ల నుంచి 42 కోట్లకు క్షీణించాయి.



Next Story

Most Viewed