ట్రాన్స్‌జెండర్లకు టీకాపై భయాన్ని తొలగించిన 'వ్యాక్సిన్ దీదీ'

by Disha Web Desk 16 |
ట్రాన్స్‌జెండర్లకు టీకాపై భయాన్ని తొలగించిన వ్యాక్సిన్ దీదీ
X

దిశ, ఫీచర్స్ : లింగమార్పిడి వ్యక్తులను కొవిడ్ మహమ్మారి అసమానంగా ప్రభావితం చేసింది. వీరిలో చాలామంది వ్యాక్సిన్‌‌పై అపోహలు పెట్టుకోవడంతో పాటు సెక్స్ చేంజ్ హార్మోన్లతో వ్యాక్సిన్ ప్రతికూలంగా స్పందిస్తుందనే భయంతో టీకాకు దూరంగా ఉన్నారు. ఈ భయాలన్నింటినీ తొలగిస్తూ చత్తీస్‌గఢ్‌లోని కంచన్ సేంద్రేకి చెందిన ఓ ట్రాన్స్ మహిళ.. టీకాపై అవగాహన కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఆమె కృషి వల్ల జిల్లాలో గత ఏడు నెలల్లో 65 మంది ట్రాన్స్‌జెండర్లు వ్యాక్సిన్ షాట్స్ తీసుకోవడం విశేషం.

'వ్యాక్సిన్ దీదీ'గా ప్రసిద్ధి చెందిన సెంద్రే కూడా లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నందున ముందుగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు సంశయించింది. కానీ 'మొదటి డోస్' తీసుకున్న తర్వాత దాని ప్రాముఖ్యతను తెలుసుకున్న తను క్వీర్ కమ్యూనిటీలోని ప్రజలకు దీనిపై అవగాహన కల్పించింది. కాగా 2008 నుంచి సెంద్రే తన కమ్యూనిటీ సంక్షేమం కోసం పనిచేస్తోంది. చత్తీస్‌గఢ్ ప్రభుత్వంలోని థర్డ్ జెండర్ వెల్ఫేర్ బోర్డ్‌లో సభ్యురాలు కూడా అయిన ఆమె 'సంఘర్ష్ సమితి' అనే సంస్థను నడుపుతోంది. ఇది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు, ప్రభుత్వ ప్రయోజనాలతో పాటు సామాజిక, ఆర్థిక సాయం కల్పించడంలో సాయపడుతుంది.

సోషల్ మీడియాలో కొవిడ్‌కు సంబంధించి ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. సెక్స్ మార్పిడి చేసుకున్న వ్యక్తుల విషయంలోనూ కొన్ని అనుమానాలు ఉండేవి. ఉదాహరణకు ఎంతోమంది 'సెక్స్ చేంజ్ హార్మోన్లు' తీసుకుంటారు. కొందరు HIV పాజిటివ్‌ కలిగి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ వేసుకుంటే శరీరం ఎలా స్పందిస్తుందో వారికి తెలియదు. అంతేకాదు చాలా మంది తమ గుర్తింపు కార్డులపై లింగాన్ని గుర్తించలేదు. దీంతో టీకా కేంద్రాల వద్ద ఎగతాళికి గురయ్యారు. ఈ విషయాలను గమనించి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దుర్గ్‌లో ట్రాన్స్‌జెండర్ల కోసం టీకా శిబిరం ఏర్పాటు చేశాను. టీకాలు వేయించుకోవడం వల్ల ట్రాన్స్‌ వ్యక్తులు ప్రజల్లో కలిసేందుకు, ముఖ్యంగా సమాజంలో సమాన సభ్యులుగా ఉండేందుకు ఇది దోహదపడుతుంది.

- సెంద్రే


Next Story