ఎల్ఐసీ ఐపీఓ వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడొచ్చు: నిపుణులు!

by Disha Web |
ఎల్ఐసీ ఐపీఓ వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడొచ్చు: నిపుణులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)పై ఫండ్ మేనేజర్ల ఆసక్తిని తగ్గించిందని, కాబట్టి ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియ 2022-23 ప్రారంభంలోనే ఉండొచ్చని నిపుణులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఈ నెలలోపు ఎల్ఐసీలోని 5 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 60 వేల కోట్ల నిధులను సమీకరించాలని భావించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తగ్గించిన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 78 వేల కోట్లకు ఎల్ఐసీ ఐపీఓ ఎంతో కీలకమైనది. అయితే, అనూహ్యంగా అంతర్జాతీయ సమస్యల వల్ల గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లన్నీ క్షీణించాయి. ఆ ప్రభావంతో దేశీయ మార్కెట్లు కూడా ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి దాదాపు 11 శాతం కుదేలయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో, స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ట్రేడింగ్ అవుతున్నప్పుడు ఎల్ఐసీని ఐపీఓకు తీసుకురావడం సమంజసం కాదని ప్రభుత్వం భావిస్తుంది. అందుకని ఈ పబ్లిక్ ఇష్యూను వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని' అషికా గ్రూప్ రిటైల్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ అరిజిత్ మలాకర్ చెప్పారు. బలహీనమైన మార్కెట్ సెంటిమెంట్, ముఖ్యంగా యుద్ధం వల్ల ఐపీఓలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించడంలేదు. అయితే, పెట్టుబడుల ఉపసంహరణకు కీలకమైన ఎల్ఐసీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని ఈక్విటీ మాస్టర్ రీసెర్చ్ కో-హెడ్ తనుశ్రీ బెనర్జీ అన్నారు.


Next Story

Most Viewed