ట్విటర్‌లో అతిపెద్ద వాటాదారుడిగా ఎలన్ మస్క్!

by Disha Web |
ట్విటర్‌లో అతిపెద్ద వాటాదారుడిగా ఎలన్ మస్క్!
X

వాషింగ్టన్: ప్రపంచ అత్యంత ధనవంతుడు, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌లో 9.2 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఎలన్ మస్క్ ట్విటర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వాక్ స్వాతంత్ర్యాలకు కట్టుబడి ఉందా అని ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. అలాగే, వాక్ స్వాతంత్ర్యాన్ని పెంచే తరహాలో కొత్త సోషల్ మీడియాను తీసుకురానున్నట్టు కూడా తెలిపారు.

అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన రెండు వారాల్లోనే ఎలన్ మస్క్ ట్విటర్‌లో అతిపెద్ద వాటాదారుగా 7.3 కోట్ల షేర్లను కొనుగోలు చేయడం గమనార్హం. ఈ వాటా కొనుగోలు ద్వారా ఎలన్ మస్క్ ట్విటర్‌లో అతిపెద్ద షేర్ హోల్డర్‌గా నిలిచారు. అంతేకాకుండా ట్విటర్‌లో ఎలన్ మస్క్ భారీగా వాటాను కొనుగోలు చేశారనే వార్తల నేపథ్యంలో సోమవారం అమెరికా మార్కెట్లలో ట్విటర్ షేర్ ధర అమాంతం 26 శాతానికి పైగా పెరిగి 49.24 డాలర్ల వద్ద ముగిసింది. ఈ కొనుగోలు విలువ 2.9 బిలియన్ డాలర్లని యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో ఎలన్ మ‌స్క్ పేర్కొన్నారు. అదేవిధంగా ట్విటర్ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సీ కంటే ఎలన్ మస్క్‌కు కంపెనీలో నాలుగు రెట్లు ఎక్కువ వాటాను కలిగి ఉండటం విశేషం. జాక్ డోర్సీకి ట్విటర్‌లో 2.25 శాతం వాటా మాత్రమే కలిగి ఉన్నారు.

Next Story

Most Viewed