Minister Errabelli: ఆయన వల్లే టీఆర్ఎస్ పార్టీ ఎదగలేదు.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk |
Minister Errabelli: ఆయన వల్లే టీఆర్ఎస్ పార్టీ ఎదగలేదు.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటే ఆ పార్టీ భూస్థాపితం అవుతందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) వంటి లాలూచీ పనులు సీఎం కేసీఆర్ చేయలేదని అన్నారు. రాష్ట్రంలో నీచమైన రాజకీయాలు చేసేది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమేనని విమర్శించారు. రేవంత్ రెడ్డి మంచోడని కాంగ్రెస్‌లో ఒక్క సీనియర్ నేతతో అయినా చెప్పమనండి అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి భాషా సరి చూసుకోవాలని సూచించారు.

మొదట్లో రేవంత్ రెడ్డి బీజేపీలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఎదగలేదని అన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరాడని ఆయన ఉన్నంత కాలం టీఆర్ఎస్ ఎదగలేకపోయిందని, ఎప్పుడైతే టీఆర్ఎస్ వీడాడో అప్పుడు తిరిగి పార్టీ ఎదిగిందన్నారు. అప్పటి వరకు మంచిగా ఉన్న తెలుగుదేశంలో చేరి ఆ పార్టీని సైతం భూస్థాపితం చేశాడని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి పార్టీని నాశనం చేస్తున్నాడని విమర్శించాడు. రేవంత్ రాకముందు కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలవగలిగిందని, కానీ ఇప్పుడు జీరో స్థానాలకే పరిమితం కాబోతోందని జోస్యం చెప్పారు.

చంద్రబాబు ఏజెంట్‌గా రేవంత్

తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఒక స్ఫూర్తితో, హుందాగా పని చేశాడన్నారు. నాడు టీడీపీలో ఉన్న తామంతా తెలంగాణ(Telangana) కోసం పని చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబు ఏజెంట్ గా పని చేశారన్నారు. రమణ, తాను కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లి తెలంగాణకు అనుకూలంగా లేఖ తీసుకువచ్చామని అందులో రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్ కోసం ధర్నాలు జరిగేవని కేసీఆర్ సీఎం అయ్యాక ఆ కష్టాలు తీరిపోయాయని అన్నారు. ముందు కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలు సరి చూసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణలో రైతులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే రైతుల కోసం 3 నుంచి 4 వేల కోట్ల నష్టం వస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందని అన్నారు. తెలంగాణ రైతులను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయకుండా రైతులకు అండగా నిలిచిన కేసీఆర్ పై విమర్శలు చేయడం దిగజారుడు తనమని ఎర్రబెల్లి దుయ్యబట్టారు.



Next Story

Most Viewed