టీఆర్ఎస్‌పై ప్రజల నిర్ణయం ఇదే.. పీకే తాజా సర్వేలో సంచలన విషయాలు

by Disha Web Desk 2 |
టీఆర్ఎస్‌పై ప్రజల నిర్ణయం ఇదే.. పీకే తాజా సర్వేలో సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహత్మక అడుగులు వేస్తున్నారు. ప్రజల నాడిని పట్టుకునేందుకు ఐప్యాక్ సంస్థ ద్వారా ఎప్పడికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు అంశాలపై సర్వేలు చేపట్టిన ప్రశాంత్ కిశోర్ టీమ్ తాజాగా మరో కీలకమైన అప్ డేట్‌ను కేసీఆర్ చేతికి అందించిదట. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఈ రిపోర్ట్ కార్డు సారాంశం అనేది పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏ అంశాలపై అసంతృప్తిగా ఉన్నారు మరే అంశాలపై ఖుషీ అవుతున్నారనే సంగతులను పొందుపరచడంతో పాటు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపుతూ సరిచేసుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ప్రజలు తీవ్ర స్థాయిలో నిరాశతో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని తెలుస్తోంది. నిరుద్యోగుల్లో ఉన్న నిరాశ, అసంతృప్తిని ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లతో కొంత మేరకు తగ్గిందనే రిపోర్ట్ ప్రభుత్వానికి చేరిందట. కొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వారిని వచ్చే ఎన్నికల్లో మార్చకుంటే పార్టీకి డ్యామేజ్ తప్పదనే హెచ్చరికలు సైతం చేశారట.

టీఆర్ఎస్ నోట కొత్త మాట అందుకేనా?

పీకే టీమ్ ఇచ్చిన రిపోర్ట్ కార్డుపై టీఆర్ఎస్ అధినేత లోతైన విశ్లేషణ చేసినట్లు సమాచారం. అంశాల వారిగా ప్రజల్లో తిరిగి నమ్మకం కలిగించే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారట. అయితే ఇటీవల టీఆర్ఎస్ మంత్రులు తరచూ కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల మాటను పదే పదే ప్రస్తావిస్తున్నారు. చాలా కాలంగా ఈ మాటను చెబుతున్నప్పటికీ తాజాగా చేస్తున్న వ్యాఖ్యల్లో ఓ పరిమిత సమయాన్ని తెరపైకి తీసుకు రావడం ఆసక్తిని రేపుతోంది. గతంలో త్వరలో కొత్త కార్డులు, పింఛన్లు అని చెప్పే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు రాబోయే రెండు నెలల్లో పనిని ప్రారంభిస్తామని చెప్పడం వెనుక పీకే టీమ్ ఇచ్చిన రిపోర్ట్ కార్డు కారణం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Next Story

Most Viewed