ఫలించిన రైతుల ఆందోళన.. మొదలైన యూరియా పంపిణీ

by Dishafeatures2 |
ఫలించిన రైతుల ఆందోళన.. మొదలైన యూరియా పంపిణీ
X

దిశ, భిక్కనూరు : యూరియా దొరకడం లేదంటూ గురువారం హైవే పైకెక్కి రైతులు చేసిన ఆందోళన ఫలించింది. అందుకు ఫలితంగా శుక్రవారం వారికి సరిపడా యూరియా(నాలుడు లోడ్‌లు యూరియా) తెప్పించారు. దీంతో యూరియా తీసుకునేందుకు రైతులు భిక్కనూరు మండలం జంగంపల్లి సొసైటీ వద్దకు శుక్రవారం వేకువజామునే చేరుకొని క్యూలో నిల్చున్నారు. పది రోజుల క్రితం కట్టిన రెండు లోడ్‌లతో పాటు, గురువారం మరో రెండు లోడ్‌లకు డీడీలు తీసి మార్క్ ఫెడ్‌కు పంపించారు. ఈ మేరకు నిన్న సాయంత్రం రెండు లోడ్‌ల యూరియా రాగా, ఈరోజు మరో రెండు లోడ్‌ల యూరియా పంపించారు.

వ్యవసాయ శాఖ ఏడీఏ అపూర్ణ పర్యవేక్షణలో ముందుగా రైతులకు అందజేసిన బుక్కుల ఆధారంగా ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఉదయం 7 గంటల నుంచి యూరియా పంపిణీ చేశారు. మరో నాలుగైదు లోడ్‌ల యూరియా వస్తే..ఈ సీజన్ గట్టెక్కినట్లేనని సొసైటీ సిబ్బంది పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది సైతం సొసైటీ వద్ద తిష్ట వేశారు. సొసైటీ వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను మొహరించారు. గురువారం చేసిన ఆందోళన ఫలితంగానే సరిపడా యూరియా సొసైటీకి వచ్చిందంటూ రైతులు తెగ సంబరపడ్డారు.



Next Story