మ్యాజిక్ చేసిన బౌలర్లు.. ఫైనల్‌కు హైదరాబాద్

by Harish |
మ్యాజిక్ చేసిన బౌలర్లు.. ఫైనల్‌కు హైదరాబాద్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్‌లో కోల్‌కతాతో హైదరాబాద్ తలపడనుంది. శుక్రవారం చెన్నయ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై 36 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. క్లాసెన్(50) హాఫ్ సెంచరీతో రాణించగా.. రాహుల్ త్రిపాఠి(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్(34) విలువైన పరుగులు జోడించాడు. అనంతరం హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో తేలిపోయిన రాజస్థాన్ 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ధ్రువ్ జురెల్(56 నాటౌట్) చివరి వరకు పోరాడినా, మిగతా వారు విఫలమవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు షాబాజ్ అహ్మద్(3/23), అభిషేక్ శర్మ(2/24) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఐపీఎల్‌లో 2018 తర్వాత హైదరాబాద్ ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ పోరుకు చేరుకోవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది మూడోసారి. 2016లో తొలిసారి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Next Story