సూపర్ వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం.. తాండూరు పోలీసులే కారణం?

by Disha Web Desk 2 |
సూపర్ వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం.. తాండూరు పోలీసులే కారణం?
X

దిశ, తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన గుర్రం సాగర్ అనే యువకుడు శుక్రవారం సూపర్ వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సూపర్ వాస్మాల్ తాగుతూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలో సంచలనం సృష్టించింది. గత ఫిబ్రవరి 21న రేచ్ని రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే పట్టాలపై అనుమానాస్పదంగా మృతిచెందిన కాసిపేట గ్రామానికి చెందిన రుకుం మహేందర్(మహేష్) అనే యువకుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మహేందర్ కుటుంబ సభ్యులు అదేరోజు సాయంత్రం యువకుడి మృతదేహంతో బంధువులు ఆందోళన నిర్వహించారు. మహేందర్ అనుమానస్పద మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. మహేందర్ మృతిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేస్తామని బెల్లంపల్లి ఏసీపీ మహేష్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే, ఈ కేసు విషయంలో తాండూర్ సీఐ జగదీష్, ఎస్ఐ కిరణ్ కుమార్ ఫన్నీ వీడియో ఆధారంగా విచారణ పేరుతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయాడు. ఈ కేసులో తనను ఇరికించాలని చూస్తున్నారని గుర్రం సాగర్ ఆరోపిస్తూ, నా ఆత్మహత్యాయత్నానికి సీఐ, ఎస్ఐలే కారణమని సూపర్ వాస్మాల్ తాగుతూ సెల్ఫీ వీడియో తీశాడు. ఈ వీడియోను మిత్రులకు వాట్సాప్‌లో షేర్ చేశాడు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు యువకుడిని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అటునుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసుల వివరణ..

మహేందర్(మహేష్) అనుమానాస్పద మృతి కేసు విషయంలో విచారణ కోసం గుర్రం సాగర్‌ను పిలిచామని, భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని తాండూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ అన్నారు. మహేందర్ మృతికి రెండ్రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో ఓ గొడవ వీడియో వైరల్ అయిందని, అందులో మహేందర్ పలువురితో గొడవ పడుతుండగా పక్కనే సాగర్ ఉన్నాడన్నారు. మహేందర్ అనుమానాస్పద మృతి కేసు విచారణలో భాగంగా వీడియో ఆధారంగా విచారణకు సాగర్‌ను పిలిపించామని, ఏదో ఊహించుకుని భయంతో సాగర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడుతూ పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సాగర్‌ను ఎలాంటి ఇబ్బందులకు, వేధింపులకు గురి చేయలేదని ఎస్ఐ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed