ఇకపై టీఎస్ కు బదులుగా టీజీ : కలెక్టర్

by Kalyani |
ఇకపై టీఎస్ కు బదులుగా టీజీ : కలెక్టర్
X

దిశ,ఆదిలాబాద్ : తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ కు బదులుగా టీజీ గా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిఓలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్ లలో టీజీ గా ఉండాలని, ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ఆటనామస్ విభాగాలన్నీ దీనిని పాటించాలని ఆదేశించారు. తెలంగాణ ఇప్పటివరకు వాహనాల రిజిస్ట్రేషన్‌కు మాత్రమే పరిమితమైన టీజీ నిబంధన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధికారిక వ్యవహారాల కు వర్తింపజేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తక్షణమే ఇది అమల్లోకి వచ్చిందని తెలిపారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాల మేరకు ఇకపైన ‘టీఎస్’ అబ్రివేషన్ స్థానంలో అధికారికంగా ‘టీజీ’ అని మార్చుకునేలా ఈనెల 30వ తేదీన డెడ్‌ లైన్‌గా ఉందని , రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటికి ఇది వర్తిస్తుందన్నారు. వెబ్‌సైట్ల తో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, రిపోర్టుల్లో ఇకపైన ‘టీజీ’ పదాన్నే (అబ్రివేషన్) వినియోగించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘టీజీ’ అనే అబ్రివేషన్‌ను అధికారికంగా గుర్తించడంతో ఈ మార్పును అన్ని విభాగాలు అమల్లోకి తెచ్చేలా ఆయా డిపార్టెమెంట్ల కార్యదర్శులు, హెచ్ఓడీలు పర్యవేక్షించాలని సీఎస్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపారు.

‘టీజీ’ అనే అబ్రివేషన్‌ను ఇకపైన అధికారికంగా వినియోగించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయంప్రతిపత్తి కలిగిన (అటానమస్) సంస్థలు ఈ మార్పును కార్యాచరణలో పెట్టాలని, అధికారులు వాడే లెటర్‌ హెడ్స్, రిపోర్టులు, నోటిఫికేషన్‌ లు, నేమ్ బోర్డులు, వెబ్‌సైట్‌లు, ఇతర అన్ని రకాల వినియోగంలో ఈ మార్పును చేపట్టాలని స్పష్టం చేశారన్నారు. దీంతో ఇప్పటివరకూ టీఎస్పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్), టీఎస్ఆర్టీసీ (తెలంగాణ స్టేట్ ఆర్‌టీసీ) తదితర పేర్లతో కొనసాగుతున్న సంస్థలు ఇకపైన టీజీపీఎస్సీ, టీజీ ఆర్టీసీ అని మార్చుకోవాలని అన్నారు.

ప్రభుత్వ వివిధ శాఖలు, విభాగాల మద్య జరిగే అంతర్గత కరస్పాండెన్స్ (ప్రత్యుత్తరాలు)తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారంలోనూ ‘టీజీ’ అనే అబ్రివేషన్‌నే వినియోగించాలని సూచించారు. అన్ని శాఖలు, విభాగాలు ఈ మార్పులు చేపట్టిన అంశంపై ఆయా శాఖల కార్యదర్శులు ఈ నెల 30 వ తేదీ లోగా సాధారణ పరిపాలన శాఖ జాయింట్ సెక్రటరీ (కోఆర్డినేషన్)కు రాతపూర్వకంగా (యాక్షన్ టేకెన్ రిపోర్టు) తెలియజేయాలని సీఎస్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారని వెల్లడించారు.ఈ సందర్భంగా ఆన్ని కార్యాలయాల్లో టీఎస్ కు బదులు టీజీ గామార్చి ఈ నెల 26వ తేదీ లోగా నివేదికలు సమర్పించాలని శాఖల అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed