ఉద్యోగ వేట ప్రారంభించారా.. నోటిఫికేషన్లు వచ్చేది అప్పుడే?

by Disha Web Desk 2 |
ఉద్యోగ వేట ప్రారంభించారా.. నోటిఫికేషన్లు వచ్చేది అప్పుడే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన నిరుద్యోగ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల కానున్నాయి. రిక్రూట్‌మెంట్ సంస్థలు ఈ వారం, వచ్చే వారం వ్యవధిలో ఒక్కో విభాగం నుంచి నోటిఫికేషన్​జారీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దఫాలో 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. అయితే, ఈ తొలి దఫా 30,453 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే ఉగాది పండుగ రోజున వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పండుగరోజున శుభవార్త చెప్పి, నిరుద్యోగుల్లో మరింత జోష్ నింపనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో త్వరలో జాబ్‌ నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో నిరుద్యోగులంతా ఉద్యోగ వేటలో పడ్డారు. నిరుద్యోగులతో పాటు అర్హులైన విద్యార్థులంతా తమ రెగ్యులర్‌ చదువులు కొనసాగిస్తూనే పోటీ పరీక్షలకు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కోచింగ్‌ సెంటర్లు ప్రారంభించగా.. ఇప్పటికే కోచింగ్‌ తీసుకున్న యువత ఇండ్ల వద్దే సంసిద్ధులవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లినా.. లైబ్రరీకి వెళ్లినా.. ఉద్యోగార్థుల సందడి నెలకొన్నది. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధించుకోవాలన్న లక్ష్యంతో పోటాపోటీగా ఉద్యోగ వేటలో పడ్డారు.

Next Story

Most Viewed