కొవిడ్ రూల్స్ పై కేంద్రం కీలక ఉత్తర్వులు.. మార్చి 31 తర్వాత

by Dishanational2 |
కొవిడ్ రూల్స్ పై కేంద్రం కీలక ఉత్తర్వులు.. మార్చి 31 తర్వాత
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడంతో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన నిబంధనలు ఈ నెల 31 నుంచి ఎత్తివేసేందుకు సిద్ధమైనట్లు బుధవారం కేంద్రం ప్రకటించింది. కానీ, మాస్కు ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం వంటివి మాత్రం పాటించాలని సూచించింది. ఈ సందర్భంగా హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దీని గురించి సమాచారం అందించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా దేశంలోని ప్రజలు కేంద్రం విధించిన నిబంధనల మధ్య జీవనం సాగిస్తున్నారు. కరోనా మహమ్మారి మొదటి కేసు నుంచి అప్రమత్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ చట్టం కింద మార్చి 24, 2020న తొలిసారిగా దేశంలో కొవిడ్ నిబంధనలను తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైరస్ కేసుల పెరుగుదలను బట్టి కొన్ని మార్పులు చేసిన కేంద్రం.. గత కొన్ని వారాలుగా వైరస్ అదుపులోనే ఉండటంతో నిబంధనలు పూర్తిగా తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. అంతేగాకుండా, వైరస్ తీవ్రతను అంచనా వేయలేం కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మాస్కును ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి పాటించాలని సూచించారు. అయితే, రాష్ట్రాలలో కేసులు పెరిగితే, ఆయా ప్రభుత్వాలు నిబంధనలు విధించుకోవచ్చని పేర్కొన్నారు.



Next Story

Most Viewed