జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు అమలు అవ్వట్లేదు.. ఎలా చేయాలంటున్న ఎమ్మార్సీలు

by Dishafeatures2 |
జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు అమలు అవ్వట్లేదు.. ఎలా చేయాలంటున్న ఎమ్మార్సీలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : విద్యా సంవత్సరం ప్రారంభమై పది రోజులు గడిచిపోయాయి. ముఖ్యంగా విద్య హక్కు చట్టం జీవో ఎంఎస్ నంబర్.1 లాంటి విద్యార్థులకు సంబంధించిన అంశాలపై జిల్లా విద్యాశాఖాధికారి చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయికి వచ్చే సరికి అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ నుంచి విద్యార్థులను కాపాడాలని వెలువడుతున్న ఆదేశాలు(ఉత్తర్వులు) ఎమ్మార్పీలకు వచ్చి అమలవ్వడం ఆలస్యమౌతుంది. విద్యాశాఖ నుంచి వెలువడిన ఉత్తర్వులను అమలు చేయాల్సిన ఎమ్మార్సీలు(మండల విద్యా వనరుల కేంద్రం)లో ఉత్తర్వులు రాలేదని చెబుతున్నారు. అధికారులు ఉత్తర్వులను లిఖితపూర్వకంగా అందజేయకుండా ఓవరాల్‌గా చెబితే ఎలా అమలు చేయాలని మండల విద్యాశాఖాధికారులు లబోదిబోమంటున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రారంభం మొదలుకుని వస్తున్న ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడానికి జిల్లా విద్యాశాఖ, మండల విద్యాశాఖ మధ్య ఉన్న గ్యాప్ (సమన్వయలోపం)ను చూపుతుంది.

నిజామాబాద్ జిల్లాలో మండల విద్యాశాఖాధికారులందరూ ఇంచార్జి హెడ్ మాస్టార్లే. జిల్లాలో అతిపెద్ద ఎమ్మార్సీగా నిజామాబాద్ ఎమ్మార్సీకి పేరు ఉంది. నిజామాబాద్ ఎమ్మార్సీకి రెగ్యులర్ ఎంఈవో లేకపోవడంతో ఎడపల్లిలో ఉన్న రామారావుకు నిజామాబాద్‌ను అదనపు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ ఎమ్మార్సీ పరిధిలోకి నాలుగు మండలాలు వస్తాయి. దాదాపు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అంటే సుమారు 40 శాతం నిజామాబాద్ ఎమ్మార్సీ పరిధిలో ఉండగా ప్రైవేట్‌వి 80 శాతం ఉన్నాయి. ఇటీవల విద్యా సంవత్సరం ప్రారంభం మొదలుకుని జిల్లా కేంద్రంగా జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు డీఈవో దుర్గాప్రసాద్ పలు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా కేంద్రం కావడంతో విద్యార్థి సంఘాలు క్రియాశీలకంగా వ్యవహరించి అనుమతి లేని విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లతో పాటు జీవో ఎంఎస్ నెంబర్‌ను తుంగలో తొక్కి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలు పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలు, టై, బెల్టులు విక్రయించడాన్ని తప్పుపడుతూ ఆందోళన చేశారు. దాంతో జిల్లా విద్యాశాఖాధికారి ఫిర్యాదులు వచ్చినవాటిని మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 17న డీఈవో దుర్గాప్రసాద్ గుర్తింపు లేని కోచింగ్ సెంటర్లయిన ఆకాష్ కోచింగ్ సెంటర్‌ను, ఐ5 కోచింగ్ సెంటర్, వికాస్, ఎస్ఎస్ రీడింగ్ రూంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దానికి తోడు అనుమతులు లేకుండా పేరు మార్చుకున్న మై చోటా స్కూల్ బ్రాంచ్‌లను తక్షణం మూసివేయాలని ఆదేశించారు. నగరంలోని రాఘవ , ఎస్ఆర్, హెచ్‌పీఎస్, శ్రీ చైతన్య, వాసవి, విశ్వోదయ పాఠశాలల్లో ఫీజుల పట్టికను ప్రదర్శించలేదని అందులో వాటిని చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు.

పలు పాఠశాలల్లో స్టేషనరీ అమ్ముతున్నట్లు గుర్తించి బంద్ చేయించాలని ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం నుంచి నిజామాబాద్ ఎంఆర్‌సీకీ కిలోమీటర్ దూరం. కానీ ఇప్పటి వరకు సంబంధిత డీఈవో ఉత్తర్వులు రాలేదని మండల విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. అధికారులు ఓరల్‌గా చెబితే ఎలా మూసివేయాలని, ఎలా చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో కిలోమీటర్ దూరంలో ఉన్న డీఈవో కార్యాలయానికి ఎంఈవో కార్యాలయం వద్దే ఉన్న సమన్వయలోపం ప్రైవేటు విద్యా సంస్థల పాలిట వరంగా విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేసినా లాభం లేకుండాపోతుంది.

విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు రాలేదని చేతులు ఎత్తేస్తుండడంతో విద్యా వ్యాపారానికి వారే సహకరిస్తున్నట్లు పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు ఒకరిపై నేపం మరోకరిపై నెట్టివేసి చెతులు దులుపుకుంటున్నట్లుగా ప్రైవేట్ విద్యాసంస్థలు గుర్తింపు లేకుండా, అనుమతి లేకుండా స్టేషనరి విక్రయాలు, నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల వసూలు, అడ్మిషన్ ల తీసుకుంటున్న విద్యా సంస్థలపై చర్యలు చెత్త బుట్టల పాలవుతున్నాయి.


Next Story

Most Viewed