CPM మాస్టర్ ప్లాన్.. తెలంగాణలో ఎర్రజెండాకు పూర్వవైభవం!

by Disha Web Desk 2 |
CPM మాస్టర్ ప్లాన్.. తెలంగాణలో ఎర్రజెండాకు పూర్వవైభవం!
X

దిశ, భద్రాచలం: మారుతున్న కాలానికి అనుగుణంగా ఎర్రజెండా నేతలు కూడా తమ పార్టీలో మార్పులకు ప్రయత్నిస్తున్నారు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని ముందస్తు వ్యూహం రచిస్తున్నారు. పోయిన చోటే వెతుక్కునే పనిలో పడ్డారు. గత ఎన్నికల్లో బీఎల్ఎఫ్ వ్యూహం బెడిసి కొట్టడంతో మరో కొత్త వ్యూహానికి నేతలు తెరలేపారు. కే.ఎన్.కే పద్ధతిని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి పార్టీ కన్వీనర్లను నియమిస్తున్నారు. ఇందులో 30 మంది సభ్యులు ఉంటారు. నిత్యం జనాల్లోనే ఉంటూ.. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని పథక రచన చేశారు.. గతంలో పార్టీ తీసుకున్న కొన్ని పద్ధతులు.. తమ పార్టీకి తీరని నష్టాన్ని కలిగించిందని స్వయంగా ఆ పార్టీ నేతలే బాహాటంగా పేర్కొంటున్నారు..


తెరపైకి కే.ఎన్‌.కే వ్యూహం: గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న సీపీఎం పార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. గత ఎన్నికల్లో అనుసరించిన బీఎల్ఎఫ్ వ్యూహం విఫలమవ్వడంతో సీపీఎం ఆత్మవిమర్శలో పడింది. రానున్న ఎన్నికల్లో.. మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకునేందుకు ఇప్పటి నుంచే సీపీఎం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకు కే.ఎన్.కే (కేంద్రీకరణ - నియోజకవర్గ - కృషి) వ్యూహం తెరపైకి తెచ్చింది. భద్రాచలం, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం తదితర తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. ఈ విషయాన్ని భద్రాచలంలో శుక్రవారం భద్రాచలం మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మిడియం బాబురావు ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియం మాట్లాడుతూ.. బీఎల్ఎఫ్ ప్రజల మన్ననలను పొందలేదని తెలిపారు. ప్రజలకు అనేక కారణాలతో సీపీఎం దూరమైందని మాజీ ఎంపీ మిడియం స్వయంగా ఒప్పుకున్నారు. తెగిన బంధాన్ని మళ్లీ పూడ్చుకొని మళ్లీ పూర్వ వైభవం దిశగా సీపీఎంను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. మాజీ ఎంపీ మాటలను బట్టి సీపీఎం పశ్చాత్తాపం పడుతున్నట్లు తేటతెల్లమైంది. తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సీపీఎం ప్రతీ నియోజకవర్గానికి కన్వీనర్లను నియమిస్తోంది.

ఇందులో భాగంగా భద్రాచలం నియోజకవర్గ సీపీఎం కన్వీనర్‌గా స్థానికులు మచ్చ వెంకటేశ్వర్లును ఆ పార్టీ నియమించి ప్రకటించడం కూడా జరిగింది. జనాల్లోకి నూతన నాయకత్వాన్ని పంపించి లబ్ధిపొందాలని సీపీఎం కొత్త తరహా విధానానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గ కమిటీలో 30 మంది సభ్యుల బృందాన్ని కూడా నియమిస్తోంది. స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు నిర్వహించేలా సీపీఎం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. తద్వారా ప్రజల మధ్య లోనే ఉంటూ... రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీపీఎం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. పోయినచోటే వెతుక్కునే పనిలో పడింది. భద్రాచలంలో సీపీఎం పోటీలో లేదని వార్తలు వస్తున్నాయని, అందులో ఎంతమాత్రం నిజం లేదని.. తాము తప్పక భద్రాచలంలో పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించింది.


Next Story