'సీఎం చేసిన తప్పులు కప్పిపుచ్చేందుకే కేంద్రంపై విమర్శలు'

by Disha Web |
సీఎం చేసిన తప్పులు కప్పిపుచ్చేందుకే కేంద్రంపై విమర్శలు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేంద్రంపై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారని బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జితేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. 24 గంటలూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని గొప్పలు చెప్పుకుంటూ వచ్చిన సీఎం కేసీఆర్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఇప్పుడు వరి కొనుగోళ్లకు సంబంధించి కొత్త డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం గత ఒప్పందాల మేరకు కొనుగోలు చేస్తుందని తెలిసికూడా.. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. విద్యుత్‌కు సంబంధించి వ్యవసాయ పంపుసెట్లకు కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడుతుందని తప్పుడు ప్రచారాలు చేశారు. ఒక్క చోట అయినా లీడర్లు వాటిని బిగించారా అని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుదల వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకే ఈ కొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచారు అంటున్నారు. మరి వాటిపై పన్ను ఎందుకు తగ్గించడం లేదని జితేందర్ రెడ్డి అన్నారు. ప్రజలు నిజానిజాలు గుర్తిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మ చారి, బాలరాజు, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ వర్ధన్ రెడ్డి, పాండురంగారెడ్డి, అంజయ్య, చిన్న వీరయ్య, రామాంజనేయులు, రామకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed