విశాఖలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్.. రాజ్యసభలో ప్రకటించిన కేంద్రం

by Disha Web Desk 13 |
విశాఖలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్.. రాజ్యసభలో ప్రకటించిన కేంద్రం
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్నంకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీపికబురు చెప్పారు. విశాఖలో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటు ప్రతిపాదన పురోగతిలో ఉన్నట్లు బుధవారం ప్రకటించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ పురోగతిపై ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. భారత్‌మాల పరియోజనలో భాగంగా దేశంలో 35 ప్రాంతాల్లో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు వెల్లడించారు.

అలా ఎంపిక చేసిన 35 ప్రాంతాల్లో విశాఖపట్నం ఒకటని చెప్పుకొచ్చారు. లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటు ఆచరణ సాధ్యతపై ఇప్పటికే ప్రీ ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తైనట్లు తెలిపారు. దీని ఆధారంగా ఫీజిబిలిటీ అధ్యయనం, ట్రంక్‌ ఇన్‌ఫ్రా కనెక్టివిటీలపై డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు నివేదికను రూపొందించే కన్సల్టెంట్‌ ఎంపికకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. అయితే ఎంత కాలవ్యవధిలో ఈ మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ ఏర్పాటు జరుగుతుందనేది అందుకు అవసరమైన భూమి లభ్యత, ఆర్థికంగా ప్రాజెక్ట్‌ ఆచరణ సాధ్యత అన్న అంశాలపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

షరతులకు లోబడి మాత్రమే రూసా నిధులు..

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలను అత్యుత్తమ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం రాష్ట్రీయ ఉచ్ఛతార్‌ శిక్ష అభియాన్‌ (రూసా) అని విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ సుభాస్‌ సర్కార్‌ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.


రూసా నిధులకు రాష్ట్రాల వాటాను సకాలంలో జమ చేయడం అంతకు ముందు విడుదల చేసిన నిధులలో 75 శాతం నిధులు ఖర్చు చేయడం వంటి కొన్ని షరతులకు లోబడి మాత్రమే తదుపరి నిధుల విడుదల జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనలకు ఆయా రాష్ట్రాలు కట్టుబడి ఉన్నట్లుగా తేలిన తర్వాత మాత్రమే కేంద్ర గ్రాంట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ సుభాస్‌ సర్కార్‌ వెల్లడించారు.



Next Story

Most Viewed