ఇంధన ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు: కేంద్ర మంత్రి

by Disha Web Desk 17 |
ఇంధన ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు: కేంద్ర మంత్రి
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారీగా ఉన్న ఇంధన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గత ఏడాది నవంబర్ నెలలో కేంద్రం ధరల తగ్గింపు నిర్ణయాన్ని 9 రాష్ట్రాలు పాటించలేదని అన్నారు. 'వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ప్రధాని మోడీ ధరలను తగ్గించారు. ఇంకా మరికొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ 9 రాష్ట్రాలు మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు' అని అన్నారు.

ఉక్రెయిన్-రష్యా యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఇంధన ధరలను చమురు సంస్థలే నిర్ణయించినప్పటికీ, ప్రభుత్వం మాత్రం వినియోగదారులకు ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇప్పటికే యూఎస్, కెనడా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, శ్రీలంక దేశాల్లో 50 శాతం పైగా ఇంధన ధరలు పెరగ్గా, భారత్‌లో మాత్రమే 5 శాతం పెరిగిందని తెలిపారు.



Next Story