కంటోన్మెంట్ ప్రజలకు మంత్రి పొంగులేటి కీలక హామీ

by Disha Web Desk 23 |
కంటోన్మెంట్ ప్రజలకు మంత్రి పొంగులేటి కీలక హామీ
X

దిశ,కంటోన్మెంట్/ బోయిన్ పల్లి : కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు తొలివిడతగా 6000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ని అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయాలని ఆయన సూచించారు. ఏడో వార్డులోని జయలక్ష్మి గార్డెన్ లో కంటోన్మెంట్ ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ ను, మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా సునీత మహేందర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని అన్ని నియోజకవర్గాలకు 3500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించామని, కంటోన్మెంట్ కు మాత్రం 6 వేల ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు.

అలాగే పార్టీ నేతలు కార్యకర్తలకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయని కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కష్టపడిన నేతలను గుర్తించి వారికి తగిన పదవులు కల్పిస్తామని, అదే సమయంలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అందరూ ఐక్యంగా మెదిలి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ యాదవ్ ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధ్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నేతలు జంపన ప్రతాప్, పల్లె లక్ష్మణ్ గౌడ్ , వెన్నెల, ముప్పిడి గోపాల్, శాంసన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed