మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీ ప్రారంభించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్!

by Disha Web Desk 12 |
మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీ ప్రారంభించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ 'స్టార్ ఉమెన్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ'ని మంగళవారం ప్రారంభించింది. ఈ పాలసీ మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశ పెడుతున్నామని, దీని ద్వారా సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ లభిస్తుందని, మహిళలు తమ జీవిత కాలంలో ఎదుర్కొనే అన్ని రకాల ఆరోగ్య అవసరాలను ఈ పాలసీ ద్వారా రక్షణ పొందవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

'స్టార్ ఉమెన్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ 18-75 ఏళ్ల వయసున్న స్త్రీలందరికీ వ్యక్తిగత పాలసీ, ఫ్లోటర్ పాలసీ రెండు రకాలుగానూ అందుబాటులో ఉంటుంది. ఈ పాలసీ కలిగి మహిళలు ఎలాంటి ప్రీ-మెడికల్ పరీక్షలు చూపించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా మూడు నెలలు, ఆరు నెలల వాయిదా పద్ధతిలో ప్రీమియం చెల్లింపుల ఎంపికను అందిస్తున్నాం. అదే విధంగా ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాలానికి ఈ సరికొత్త పాలసీని తీసుకునే వెసులుబాటు ఉంటుందని' కంపెనీ వివరించింది.

సాధారణ ఆస్పత్రి ఖర్చులతో పాటు ప్రసవానికి ముందు, ఆ తర్వాత, వివిధ మెడికల్ కన్సల్టేషన్, రీ-ప్రొడక్షన్ ట్రీట్‌మెంట్, పిల్లల ఆసుపత్రి ఖర్చులు, హెల్త్ చెకప్స్ సహా వివిధ రకాల వైద్య సంబంధిత అవసరాలకు ఈ పాలసీ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. పుట్టిన బిడ్డకు మొదటి రోజు నుంచి పాలసీ కవరేజీ మొత్తంలో 25 శాతం వరకు బీమా, ఏడాది నుంచి 100 శాతం బీమా వర్తిస్తుంది. రూ. కోటి హామీ మొత్తంతో లభించే ఈ పాలసీ లో కస్టమర్లు రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు, రూ. 15 లక్షలు, రూ. 25 లక్షలు, రూ. 50 లక్షల హామీ ఉన్న వాటిని కూడా ఎంచుకునే వీలుంటుంది. వీటితో పాటు అనేక రకాల ఫీచర్లను ఈ పాలసీ లో అందిస్తున్నామని కంపెనీ వెల్లడించింది.


Next Story