కరీంనగర్ ఎంట్రన్స్‌లో నయా దందా.. ఆ నాలుగు గంటలే కీలకం!

by Disha Web Desk 2 |
కరీంనగర్ ఎంట్రన్స్‌లో నయా దందా.. ఆ నాలుగు గంటలే కీలకం!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌ను ఆనుకుని ప్రవహిస్తున్న మానేరు నది స్మగ్లర్ల పాలిట కల్పతరువుగా మారింది. ఇసుక అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకునే వారే కాదు.. ఈ దందాకు భరోసా కల్పిస్తున్న ఏజెంట్లు కూడా కమీషన్లతో జేబులు నింపుకుంటున్నారు. దీంతో మానేరు తీరం ఇసుక ట్రాక్టర్లతో వారధిని మరిపిస్తోంది.

ట్రాక్టర్‌కు 5 వేలు..

ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5 వేల చొప్పున ఏజెంట్లు కమీషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ముగ్గురు ఏజెంట్లు 70 నుండి 100 ట్రాక్టర్లకు ఇన్‌చార్జిలుగా ప్రకటించుకుని ఇసుక అక్రమ రవాణాకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని బాహాటంగానే ప్రచారం జరుగుతోంది. వీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఇసుక తరలించేందుకు మానేరు నదిలోకి ట్రాక్టర్ వెళ్లాల్సి ఉంటుందని లేనట్టయితే ఆ ట్రాక్టర్‌కు అనుమతి ఇవ్వరని తెలుస్తోంది. దీంతో ఇసుక దందా చేయాలనుకునే వారు ముందుగా స్వయం ప్రకటిత ఏజెంట్ల ప్రాపకం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. సహజ వనరులే అయినప్పటికీ ఆ ప్రాంతానికి వారే గుత్తే దారులుగా తయారయ్యరని ప్రచారం. సాక్షాత్తు కరీంనగర్ ఎంట్రన్స్‌లోనే వీరు తమ దందా కొనసాగిస్తున్నా నియంత్రించే వారే లేకపోవడం విడ్డూరం.

4 గంటల్లోనే...

అర్థరాత్రి మానేరు తీరానికి చేరుకునే ట్రాక్టర్లు తాము వచ్చామన్న సంకేతాలు ఏజెంట్లకు పంపిస్తారు. తెల్లవారుజామున 2 గంటల నుండి 6 గంటల వరకు వందలాది ట్రాక్టర్లలో ఇసుక లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఇసుక ఎక్కడెక్కడికి తరలించాలో అడ్రస్ చెప్పే నెట్ వర్క్ సిద్ధంగా ఉంటుంది. ఇలా నిత్యం ఇసుక దందా సాగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

Next Story

Most Viewed