మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీ గూటికి సొంత బాబాయ్..?

by Satheesh |
మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీ గూటికి సొంత బాబాయ్..?
X

లక్నో: యూపీ ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ త్వరలోనే బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఆయన ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాధ్, మాజీ డిప్యూటీ సీఎం దిశేశ్ శర్మలను ట్విట్టర్‌లో ఫాలో చేశారు. ఆయన తాజా చర్యలతో శివపాల్ యాదవ్ నిజంగానే బీజేపీలోకి వెళతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మొన్న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో శివపాల్ యాదవ్ ఎస్పీ పార్టీ గుర్తుపై గెలిశారు. అయితే, గత నెలలో జరిగిన ఎస్పీ కీలక సమావేశానికి హాజరుకాకుండా మార్చి 31న ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సీఎం యోగి నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతారని ప్రచారం జోరందుకుంది. ఈ విషయంపై ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) అధికార ప్రతినిధి దీపక్ మిశ్రా స్పందించారు.

' కొత్తఏడాదిలో కొత్తదనం ఉండాలని లోహియా అధినేత శివపాల్ యాదవ్ శనివారం పీఎం మోడీ, సీఎం యోగిని అనుసరించారు. గతంలో భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, దలైలామా, రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌లను కూడా అనుసరించారు' అని గుర్తుచేశారు. కాగా, మొన్నటి ఎన్నికల్లో శివపాల్ కొడుకు ఆదిత్య యాదవ్‌కు ఎస్పీ చీఫ్ టికెట్ కేటాయించలేదు. దీంతో శివపాల్ యాదవ్‌ను రాజ్యసభకు పంపి, ఆయన కుమారుడు ఆదిత్య యాదవ్‌కు బీజేపీ పార్టీ జస్వంత్‌నగర్ అసెంబ్లీ సీటు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యూపీలో పదకొండు రాజ్యసభ స్థానాలు ఏప్రిల్ మరియు జూలై మధ్య ఖాళీ కానున్నాయి. అందుకోసమే కాషాయ లీడర్లు శివపాల్‌ను పార్టీలో చేర్చుకోవాలని డీల్ మాట్లాడినట్టు తెలుస్తోంది. కాగా, ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాద 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed