ప్రైవేటీకరణ కోసం త్వరలో ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానం: దీపం కార్యదర్శి!

by Disha Web Desk 17 |
ప్రైవేటీకరణ కోసం త్వరలో ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానం: దీపం కార్యదర్శి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ మెజారిటీ వాటా కలిగిన ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)కి ఆహ్వానిస్తామని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) సెక్రటరీ తుహిన్ కాంత పాండె గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎంసీసీఐ) నిర్వహించిన వెబ్‌నార్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇటీవల ఎయిర్ ఇండియా, నీలచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్) సంస్థలను విజయవంతంగా ప్రైవేటీకరణ పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెయిల్‌లో కొన్ని యూనిట్లు, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన స్టీల్ ప్లాంట్‌ల కోసం ఈఓఐ ప్రక్రియ కోసం సిద్ధమవుతున్నాయి. మూడు ముఖ్యమైన కంపెనీలు, రైల్‌టెల్, ఐఆర్ఎఫ్‌సీ, మజగావ్ డాక్ సంస్థలు కూడా గత ఏడాది స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ చేయబడ్డాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల మధ్య మార్కెట్ల పరిస్థితులను గమనిస్తున్నాం. త్వరలో ఎల్ఐసీ ఐపీఓ మార్కెట్లకు రానుంది. ఇది దేశీయ కేపిటల్ మార్కెట్‌కు గొప్ప అవకాశం ఉంటుందనే ఆశిస్తున్నట్టు తుహిన్ కాంత పాండె అన్నారు.


Next Story