రూ. 24 లక్షల కోట్లను దాటనున్న భారత సేవల రంగం ఎగుమతులు!

by Web Desk |
రూ. 24 లక్షల కోట్లను దాటనున్న భారత సేవల రంగం ఎగుమతులు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ సేవల ఎగుమతులు 2022-23లో సుమారు రూ. 24.27 లక్షల కోట్లకు చేరుకుంటుందని సర్వీసెస్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఈపీసీ) ఛైర్మన్ సునీల్ హెచ్ తలతి అభిప్రాయపడ్డారు. అన్ని రకాల సేవలకు డిమాండ్ పెరగడం, సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలు క్రమంగా పునరుద్ధరిస్తుండటం వంటి పరిణామాలు సేవల ఎగుమతుల వృద్ధికి దోహదం కానున్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సేవల ఎగుమతులు దాదాపు రూ. 19 లక్షల కోట్లుగా నమోదయ్యే అవకాశం ఉంది. 2021-22 లో ఏప్రిల్-జనవరి మధ్య ఎగుమతుల అంచనా విలువ రూ. 16 లక్షల కోట్లు, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన దానికంటే 25.31 శాతం వృద్ధి. 'త్వరలో కరోనా మహమ్మారి చాలా వరకు తగ్గుతుందనే ఆశలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ అన్ని రకాల సేవలకు డిమాండ్ పెరుగుతోంది.

ఈ పరిణామాలను అంచనా వేస్తూ.. దేశ సేవల ఎగుమతులు రూ. 24 లక్షల కోట్లను అధిగమిస్తాయని' సునీల్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ దేశీయ సేవల రంగంలో మొత్తం ఎగుమతుల పరంగా 90-91 శాతం పనితీరు కొనసాగింది. వార్షిక వృద్ధి రేటు 8-9 శాతం వద్ద పెరుగుతోందని, గత రెండు దశాబ్దాల్లో భారత సేవల రంగం ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రెండో అతిపెద్ద మార్కెట్ అని సునీల్ వెల్లడించారు.


Next Story