వంటనూనె ధరలను రూ. 3-5 తగ్గించాలని కంపెనీలను కోరిన పరిశ్రమల సంఘం!

by Web Desk |
వంటనూనె ధరలను రూ. 3-5 తగ్గించాలని కంపెనీలను కోరిన పరిశ్రమల సంఘం!
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ పరిణామాల వల్ల దేశీయంగా వంటనూనె ధరలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో కనీస రిటైల్ ధరల(ఎంఆర్‌పీ)పై కిలోకు రూ. 3-5 తగ్గించాలని పరిశ్రమల సంఘం దేశీయ కంపెనీలను కోరింది. వినియోగదారులకు అధిక ధరల నుంచి ఉపశమనం ఇచ్చేందుకు ఎంఆర్‌పీ తగ్గించాలని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) కంపెనీలను అభ్యర్థించడం ఇది రెండోసారి. ఇదివరకు 2021, నవంబర్‌లో దీపావళి సందర్భంగా వంటనూనెలపై ఎంఆర్‌పీని కిలోకు రూ. 3-5 తగ్గించాలని కోరింది.

భారత్ దేశీయంగా అవసరమైన వంటనూనెలో 60 శాతం దిగుమతుల పైనే ఆధారపడి ఉంది. ఈ క్రమంలో ధరల పెరుగుదలను నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. దేశీయ రిటైల్ ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, స్టాక్ నిల్వలకు పరిమితులు విధించడం చేస్తోంది. అయితే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా సగటు రిటైల్ ధరలు గత ఏడాది కంటే ఎక్కువగానే ఉన్నాయి.

పలు ఎగుమతి దేశాలు తమ పామాయిల్ ఎగుమతులను నియంత్రిస్తున్నాయి. అంతర్జాతీయంగా వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆ ప్రాంతం నుంచి వచ్చే సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరల పెరుగుదలకు మరోసారి ఆజ్యం పోసింది. ఇవి కాకుండా ఇంకా అనేక కారణాలతో గ్లోబల్ మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుని కంపెనీలు వంటనూనెల్పై ఎంఆర్‌పీని టన్నుకు రూ. 3,000-5,000 మధ్య తగ్గించాలని అభ్యర్థిస్తున్నట్టు ఎస్ఈఏ వెల్లడించింది.

కాగా, వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వేరుశెనగ నూనె ఎంఆర్‌పీ ధర గతేడాది ఫిబ్రవరిలో రూ. 164.55 ఉంటే, ఇప్పుడు రూ. 177.75గా ఉంది. ఆవనూనె రూ. 145.02 నుంచి ఇప్పుడు రూ. 187.03గా ఉంది. సోయా ఆయిల్ రూ. 126.03 నుంచి రూ. 147.36కి పెరిగింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 144.22 నుంచి రూ. 161.75, పామాయిల్ రూ. 113.89 నుంచి రూ. 130.53కి పెరిగింది.



Next Story

Most Viewed