స‌రికొత్త విజ‌యం: మాన‌వ జినోమ్‌ను పూర్తిగా మ్యాపింగ్ చేసిన శాస్త్ర‌వేత్త‌లు!

by Disha Web Desk 20 |
స‌రికొత్త విజ‌యం: మాన‌వ జినోమ్‌ను పూర్తిగా మ్యాపింగ్ చేసిన శాస్త్ర‌వేత్త‌లు!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః రెండు ద‌శాబ్ధాల కింద‌ట హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ప‌రిశోధ‌కులు మొదటిసారి మానవ జన్యువును లెక్కించ‌డం పూర్తి చేసినట్లు ప్ర‌క‌టించారు. అది అప్ప‌టికి చాలా ముఖ్యమైన విజ‌యంగా పేర్కొన్నారు. మొదటిసారిగా, మానవ జీవితంలో DNA బ్లూప్రింట్ అన్‌లాక్ చేసింది అప్పుడే. కానీ, ఇందులో శాస్త్ర‌వేత్త‌లు కొన్నింటిని లెక్కించ‌లేక‌పోయారు. అంటే, జన్యువుల్లోని అన్ని జన్యువుల‌ సమాచారాన్ని కలిపి ఉంచలేకపోయారు. అందుకే మొద‌టి విజ‌యంలో 92% పూర్తి చేయ‌గ‌లిగారు గానీ మిగిలిన 8% ఖాళీలు అలాగే ఉండిపోయాయి. పూరించడానికి క‌ష్ట‌సాధ్యంగా ఉండి, తరచుగా పునరావృతమయ్యే ప్రాంతాలను కలపడానికి ప్ర‌య‌త్నించినా అవి చాలా గందరగోళంగా ఉండ‌టంతో రెండు ద‌శాబ్ధాల పాటు శాస్త్ర‌వేత్త‌లు దీనిపై కృషి చేశారు.

ఈ రెండు ద‌శాబ్ధాల్లో పునరావృతమ‌య్యే డీఎన్ఏల, జ‌న్యువుల క్ర‌మాన్ని గుర్తించి, అధ్య‌య‌నం చేయ‌గ‌ల సాంకేతికత అభివృద్ధిచెంద‌టంతో ప్ర‌స్తుతం పూర్తిస్థాయిలో మాన‌వ జినోమ్ మ్యాపింగ్ విజ‌య‌వంతంగా పూర్తిచేయ‌గ‌లిగారు. మే 2021లో ఆ ఖాళీలను పూరించ‌గా, మొదటి ఎండ్-టు-ఎండ్ హ్యూమన్ జీనోమ్ అధికారికంగా మార్చి 31, 2022న ప్రచురించారు. పునరావృతమయ్యే DNA శ్రేణులను, అవి పరిణామ చరిత్రలో జన్యువులను ఎలా రూపొందిస్తాయో జన్యు జీవశాస్త్రవేత్తలు అధ్యయనం చేసారు. జన్యువు నుండి తప్పిపోయిన పునరావృత క్ర‌మాన్ని శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. ఇప్పుడు, మానవ జన్యువులో పునరావృతమ‌య్యే ప్రాంతాలను కూడా పూర్తిగా అన్వేషించగ‌లుగుతున్నారు. దీనితో మానవ జినోమ్‌లో మొదటిసారి జ‌న్యువుల‌ పూర్తి క్రమాన్ని, అందులో అంతరాలను గుర్తించి, ప్రతి క్రోమోజోమ్‌ను ఆ చివరి నుండి ఈ చివరి వరకు కవర్ చేయ‌గ‌లుగుతున్నారు.

ఇక‌, మాన‌వ‌ జీనోమ్‌ను ఇలా పూర్తిక్ర‌మాన్ని గుర్తించ‌డం వ‌ల్ల‌ మానవాళి చాలా విష‌యాల‌ను వెలికితీయ‌గ‌ల‌రు. మాన‌వ‌ పరిణామంలో మ‌రుగున ఉన్న ఎన్నో విశేషాలను క‌నుక్కోడానికి ఈ విజ‌యం స‌హాయం చేస్తుంది. అంతేగాక‌, ఇది జీవశాస్త్రంపై ఎక్కువ అవగాహన ఇస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే వృద్ధాప్యం, న్యూరోడెజెనరేటివ్ పరిస్థితులు, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి రంగాలలో స‌రికొత్త‌ వైద్య ఆవిష్కరణలకు ఇది తలుపులు తెరుస్తుంది.

Next Story

Most Viewed