రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ

by Dishanational1 |
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ
X

బెంగళూరు : మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో మెరిశాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో అతనికి ఇది నాలుగో సెంచరీ. సర్ఫరాజ్ ఖాన్ అద్భుత పోరాటంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్ బౌలర్ గౌరవ్ యాదవ్ 4 వికెట్ల ప్రదర్శన చేయడంతో శుక్రవారం తొలి సెషన్ పూర్తయిన కాసేపటికే ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్ నైట్ స్కోరు 248/5తో గురువారం బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకి ఆరంభంలోనే గౌరవ్ యాదవ్ షాకిచ్చాడు. ఓవర్ నైట్ బ్యాటర్ షామ్స్ ములానీ(12)ని అవుట్ చేశాడు. అయితే, తొలి రోజు అర్ధ సెంచరీకి చేరువైన సర్ఫరాజ్ ఖాన్ మధ్యప్రదేశ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. మరోవైపు, గౌరవ్ యాదవ్ వికెట్లు తీస్తూనే ఉన్నాడు. తనుష్(15), తుషార్(6)లను పెవీలియన్‌కు పంపగా.. అనుభవ్ అగర్వాల్ బౌలింగ్‌లో కులకర్ణి(1) అవుటయ్యాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా సర్ఫరాజ్ ఖాన్ ప్రత్యర్థి బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీ పూర్తి చేశాడు. 243 బంతులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 134 పరుగులు చేసి గౌరవ్ యాదవ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. దాంతో ముంబై తొలి ఇన్నింగ్స్ ముగిసింది. బ్యాటింగ్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్(31) తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ యష్ దూబే(44), శుభమ్ ఎస్ శర్మ(41) కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. యష్ ఆచితూచి ఆడగా.. శర్మ మాత్రం దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండగా జాగ్రత్తగా ఆడటంతో మధ్యప్రదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 123 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్ ఇంకా 251 పరుగుల వెనుకంజలో ఉంది. చేతిలో వికెట్లు ఉండటంతో మొదటి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ లీడ్ సాధించే చాన్స్ ఉంది. మ్యాచ్ డ్రా అయినా తొలి ఇన్నింగ్స్ ఆధారంగా విజయం సాధించే అవకాశం ఉండటంతో మధ్యప్రదేశ్ ఆ దిశగా ఆలోచిస్తున్నది.


Next Story

Most Viewed