రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడు.. నయవంచకుడు: రేవంత్ రెడ్డి

by Dishanational1 |
రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడు.. నయవంచకుడు: రేవంత్ రెడ్డి
X

దిశ, చౌటుప్పల్: భుజాల మీద మోసిన కార్యకర్తలను, ప్రజలను మోసం చేసిన నయవంచకుడు, చరిత్ర హీనుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఈడీ కేసుల పేరుతో విచారణకు పిలిపించి వేధిస్తున్న సమయంలో ఆమెకు అండగా ఉండాల్సింది పోయి, కాంట్రాక్టుల కోసం అమిత్ షాను కలిసిన నీచుడు రాజగోపాల్ రెడ్డి అని విరుచుకుపడ్డాడు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిజాం నవాబులకు, మర ఫిరంగులకు ఎదురొడ్డి నిలబడ్డ మునుగోడు బిడ్డలు తిరిగి ఈ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తారనే నమ్మకం ఉందని అన్నారు. నల్లగొండ జిల్లాలో ధర్మబిక్షం, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి లాంటి నాయకులు నమ్ముకున్న ప్రజలకు, పార్టీకి కట్టుబడి పని చేసిన నాయకులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారని అన్నారు. అలాంటి నల్లగొండ జిల్లాలో నమ్మిన ప్రజలను, పార్టీని మోసం చేసిన విశ్వాసఘాతకుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వారిని రాజకీయాలలో ఎప్పుడూ చూడలేదని అన్నారు.

అభివృద్ధి కోసమే రాజీనామా అంటూ డ్రామాలు...

మునుగోడు అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేస్తానని ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తానంటే తామే ముందుండి గెలిపించే వాళ్లమని అన్నారు. కానీ, అభివృద్ధి పేరుతో కాంట్రాక్టుల కోసమే అమిత్ షా పంచన చేరుతున్నారని విమర్శించారు. అధికారం వచ్చినా రాకున్నా పేద ప్రజల పక్షాన నిలబడి పాలకులపై పోరాడిన గడ్డ మునుగోడు అని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగడం లేదని చెప్తున్నా రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరగలేదా అని ప్రశ్నించారు. 2018 సంవత్సరంలో పాల్వాయి స్రవంతికి ఇవ్వవలసిన టికెట్ రాజకీయ కారణాలతో రాజగోపాల్ రెడ్డికి కేటాయిస్తే ఇప్పుడు ప్రజలను పార్టీని మోసం చేసి వెళ్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక మోడీ, అమిత్ షా ఎలక్షన్ కమిషన్, ఈడీ మూసివేసిన కేసులలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిలాంటి సోనియా గాంధీని హాజరు కావాలంటూ నోటీసులు పంపించారని, అలాంటి కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకు అండగా ఉండాల్సిన వ్యక్తి అమిత్ షా దగ్గరికి వెళ్లి కాంట్రాక్ట్ కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని విమర్శించాడు. 21 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఒప్పందం కోసం అమిత్ షా కాళ్లదగ్గర మోకరిల్లాడు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే పదవి లేకపోతే రాజగోపాల్ రెడ్డిని అమిత్ షా ఆఫీసులో బంట్రోతు కూడా గుర్తు పట్టే వాడు కాదు అని అన్నారు.

రాజీనామాపై కొత్త రాగం అందుకున్న రాజగోపాల్ రెడ్డి

ఇన్నినాళ్ళు అభివృద్ధి కోసమే రాజీనామా అంటూ డ్రామాలు ఆడినా రాజగోపాల్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి నాయకత్వం కింద తాను పని చేయలేక పార్టీ మారుతున్నట్లు కొత్త రాగం ఎత్తుకున్నాడని అన్నారు. 2014 సంవత్సరం ముందు తనపై ఒక్క కేసు కూడా లేదని తదనంతరం కేసీఆర్ కుటుంబం, అవినీతి పాలనపై కొట్లాడినందుకు తనపై 120 అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. 30 రోజులు జైలుకు వెళ్లి వచ్చిన తన నాయకత్వం కింద పని చేయలేనని చెప్పిన రాజగోపాల్ రెడ్డి, 90 రోజులు జైలుకు వెళ్లి వచ్చిన అమిత్ షా కింద ఎలా పని చేస్తాడని ప్రశ్నించాడు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అవకాశాలు ఇస్తే కార్యకర్తలను, ప్రజలను మోసం చేసి కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతున్నారని ఎద్దేవా చేశారు.

అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నానని చెబుతున్నా రాజగోపాల్ రెడ్డి ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల కోసం ప్యాకేజీ తీసుకురాకుంటే ముక్కు నేలకు రాస్తావా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మునుగోడు ప్రజల పైన ఉందని, ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద విశ్వాసంతో మాత్రమే పని చేస్తుందని, పైసలు ఇచ్చే వాళ్లకు పట్టం కడితే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించడం చారిత్రాత్మక అవసరమని, రాజకీయ ఒప్పందాలు బేరసారాలు చేసే రాజగోపాల్ ను మునుగోడులో పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తాను మండలాల వారీగా నియోజకవర్గంలో పర్యటిస్తానని, ఎవరూ అధైర్య పడొద్దని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు. కార్యకర్తలపై ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి, ఆయన అనుచరులకు తనపై కోడిగుడ్లు, టమాటాలు వేయాలని చెప్పినట్లు తెలుస్తుందని, తమపై ఒక గుడ్డు పడితే నీ ఇంటిపై పేడ పడుతుందని హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీకి కార్యకర్తల అంతా అండగా ఉండాలని, వారికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత లభిస్తుందని సూచించారు.

ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజ్, నదీమ్ జాహిద్, రోహన్ చౌదర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, చిన్నారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, సీతక్క, అనిల్ కుమార్, అద్దంకి దయాకర్, పాల్వాయి స్రవంతి, పున్నా కైలాష్ నేత, పల్లె రవికుమార్ గౌడ్, చలమల కృష్ణారెడ్డి, చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణి, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed