బాల సాహితీ వేత్త రెడ్డి రాఘవయ్య కన్నుమూత

by Disha Web Desk 4 |
బాల సాహితీ వేత్త రెడ్డి రాఘవయ్య కన్నుమూత
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ బాలసాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కార గ్రహీత రెడ్డి రాఘవయ్య (82) నగరంలోని బాలానగర్‌లో ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ఎర్రగడ్డలోని ఈఎస్ఐ స్మశానవాటికలో సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమార్తె రాజేశ్వరి తెలిపారు. కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో 1940 జూలై 1న పుట్టిన రెడ్డి రాఘవయ్య స్వగ్రామంతో పాటు నిడుబ్రోలులో పాఠశాల విద్య చదివారు. నెల్లూరు ఐటీఐలో డిప్లొమా కోర్సు పూర్తిచేసి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. కొంతకాలం బెంగుళూరులో పనిచేసి ఆ తర్వాత హైదరాబాదుకు షిప్ట్ అయ్యారు. 2000వ సంవత్సరంలో రిటైర్ అయిన రాఘవయ్య బాలానగర్‌లో నివసిస్తున్నారు.

విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే సాహిత్య కృషిని మొదలుపెట్టిన ఆయన మొదటి కథ 'సలహా' 1955 డిసెంబరులో విశాలాంధ్ర దిన పత్రికలో ప్రచురితమైంది. 'బాల నీతిమాల' పద్యాల సంపుటి 1979లో వెలుగుచూసింది. ఆ తర్వాత మణిదీపాలు, నవరత్నాలు, బాలలలోకం, పసిడి పాటలు, మంచి పూలు, జ్ఞానులు-విజ్ఞానులు, పూలతోట, రంగుల రాట్నం తదితర రచనలన్నీ పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి. బాలసాహితీవేత్తగా ఉంటూనే ఎంతో మంది యువ బాలసాహితీ రచయితలను ప్రోత్సహించారు. బాలసాహిత్య రచయితల వివరాలన్నీ సేకరించి వార్త దినపత్రిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. చివరకు ఈ వివరాలతోనే తెలుగు బాలల రచయితల సంఘం 2002లో పుస్తకంగా అచ్చువేసింది.

బాలసాహిత్యంలో రాఘవయ్య చేసిన కృషికి గుర్తింపుగా 'నేతాజీ సుభాష్ చంద్రబోస్' పుస్తకానికి 2003లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. చిరుదివ్వెలు పుస్తకానికి 2012లో కేంద్ర సాహిత్య అకాడెమీ బాలసాహిత్య పురస్కారం లభించింది. రాఘవయ్య మృతి పట్ల బాల సాహిత్య పరిషత్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి కుటుంబానికి సానుభూతిని తెలిపినట్లు కార్యదర్శి దాసరి వెంకటరమణ పేర్కొన్నారు.



Next Story