వారికి సంక్షేమ పథకాలు అందించడం పెద్ద కష్టమేమి కాదు : మంత్రి కొప్పుల

by Disha Web Desk 12 |
వారికి సంక్షేమ పథకాలు అందించడం పెద్ద కష్టమేమి కాదు : మంత్రి కొప్పుల
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ఒక మండలంలో పదిహేను మంది జర్నలిస్టులు ఉంటే.. వారిలో చాలా మంది దళిత జర్నలిస్టులు ఉంటారని, వారికి సంక్షేమ పథకాలు అందించడం పెద్ద కష్టం కాదని షెడ్యూల్ కులాల అభివృద్ధి, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో శనివారం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దళిత జర్నలిస్టుల ప్రత్యేక శిక్షణా తరగతులు ఆయన ప్రారంభించి మాట్లాడారు.

దళిత జర్నలిస్టులకు దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో మరెక్కడా అమలు కావడం లేదన్నారు. దళిత జర్నలిస్టుల సంక్షేమానికి పాటు పడతామని చెప్పారు. వివక్ష నుండి జర్నలిస్టులు బయట పడాలని ఆయన సూచించారు.

ఈ ప్రభుత్వం మీది..

ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. జర్నలిస్టులుగా మీరు, ప్రజా ప్రతినిధులుగా మేము అందరం కలిసి నవ తెలంగాణ నిర్మాణంలో పాలు పంచుకోవాలని అన్నారు. ఈ ప్రభుత్వం మీది.. జర్నలిస్టుల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం మీడియా అకాడమీ ఏ నిర్ణయం తీసుకున్నా నా వంతు సహకారం అందిస్తానన్నారు.

ప్రపంచాన్ని నడిపించే శక్తి డిజిటల్ మీడియాది..

నేడు అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని నడిపించే శక్తి డిజిటల్ మీడియాకు ఉందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. డిజిటల్ మీడియా అనేది కొత్తగా వచ్చిన మీడియా అన్నారు. సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో ఒక మీడియా ఉందన్నారు. ప్రతి వాళ్ల జేబుల్లో ఫోన్ రూపంలో ఓ సమాచార మీడియా ఉందని చెప్పారు. దీంతో అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని ఏలేంత శక్తి కలిగిన డిజిటల్ మీడియా వచ్చిందన్నారు. నేటి సమాజంలో తెలియకుండానే ఎస్టీ, ఎస్టీలు వేధింపులకు గురవుతున్నారని, దీని నుండి విముక్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు.

సమాజంలో దళితులు మరింతగా మిళితం కావాలని, వారి పట్ల ఉన్న వివక్ష తొలగాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, క్రాంతి కిరణ్, చిన్నం దుర్గయ్య, గాదరి కిశోర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మల్లేపల్లి లక్ష్మయ్య, ఐ ఎన్ పీఆర్ డైరెక్టర్ నాగయ్య, టీయూడబ్ల్యూజే జీఎస్ మారుతీ సాగర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed